స్వయం పాలనకోసంబలూచిస్థాన్‌లో సాగుతోన్న వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ కొత్త చట్టం తెచ్చింది. ఉగ్రవాద వ్యతిరేక (సవరణ) చట్టం 2025 పేరుతో తీసుకొొచ్చిన ఈ చట్టంపై స్థానికులు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం సైన్యానికి, నిఘా సంస్థలకు ఉండటమే దీనికి కారణం. ఈ చట్టం పౌరుల హక్కులను ఉల్లంఘిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బలోచ్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టం రూపొందించారు. అనుమానం ఉంటే చాలు, ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. కోర్టు అనుమతి లేకుండానే 90 రోజుల వరకు నిర్బంధించవచ్చు. పోలీసులు, నిఘా సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేయవచ్చు. ఆధారాలు సేకరించవచ్చు. అరెస్టు చేయడానికి కూడా వీలుంది. కేవలం అనుమానం ఆధారంగా అరెస్టులు చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.పాక్ సైన్యం వేర్పాటువాద ఉద్యమకారుల దాడులు ఇటీవల తీవ్రమైన విషయం తెలిసిందే.
ఈ చట్టం వల్ల ప్రజలకు న్యాయపరమైన రక్షణ ఉండదని, గతంలో రహస్యంగా జరిగే పనులను ఇప్పుడు చట్టబద్ధం చేశారని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇది పాకిస్థాన్ రాజ్యాంగానికి, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని హెచ్చరిస్తున్నారు. స్థానిక మానవ హక్కుల సంఘం హెచ్‌ఆర్‌సీపీతో పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్, ఐసీసీపీఆర్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
బలూచిస్థాన్‌లో నిర్బంధాలు, అదృశ్యాలు సాధారణమయ్యాయి. చాలా కుటుంబాలు తమ వారి కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాయి. ఈ అదృశ్యాల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడంతో బలోచ్ ప్రజలు మరింత భయపడుతున్నారు. ఈ చట్టంపై బలోచ్ యక్తేజీ కమిటీ (బీవైసీ) స్పందించింది. ‘ఈ చట్టంలోని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛను, ఏకపక్ష నిర్బంధం నుంచి రక్షణను ఉల్లంఘిస్తాయి’ అని బీవైసీ పేర్కొంది.
ఈ చట్టం ప్రజల స్వేచ్ఛను హరిస్తుందని, ఎవరినైనా కారణం లేకుండా అరెస్టు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇస్తుందని వారు అంటున్నారు. ఈ చట్టం ద్వారా కలిగే పరిణామాలను నాజీ జర్మనీ, ఆధునిక చైనాలోని అంతర్గత నిర్బంధ శిబిరాలతో సరిపోల్చారు. తమ హక్కులను హరించేలా ఉన్న కఠిన చట్టాన్ని రద్దుచేసేలా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, ప్రపంచ పౌర సమాజం ఇస్లామాబాద్‌పై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. ‘ఇప్పుడు మౌనంగా ఉండటం అంటే అణచివేతకు భాగస్వామిగా మారడమే’అని BYC తీవ్ర హెచ్చరిక చేసింది.
బలోచిస్థాన్‌లో పాక్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం వివాదాస్పదంగా మారింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం పేరుతో ప్రజలను 90 రోజుల వరకు విచారణ లేకుండానే నిర్బంధించే అధికారాన్ని సైన్యానికి కట్టబెట్టారు. ఇది పౌరుల హక్కులను కాలరాయడమేనని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కనిపించకుండా పోయిన వారి గురించి వెతుకుతున్న కుటుంబాలలో ఈ చట్టం మరింత భయాన్ని కలిగిస్తోంది. అసలేం జరుగుతోంది?
ఇకపై సైనిక అధికారులు కూడా పరిశీలనా కమిటీల్లో భాగమవుతారని, దీని వల్ల పౌరపాలనపై సైనికాధిపత్యం పెరిగే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. ఈ చట్టం పోలీసులకు ముందస్తు న్యాయ అనుమతి లేకుండా తలాషీ, అరెస్ట్, ఆస్తుల స్వాధీనం చేపట్టేందుకు అధికారాలు కల్పిస్తోంది. ఇది దుర్వినియోగానికి తలుపులు తెరుస్తుందని, సామూహిక నిఘా ముప్పు పెరుగుతుందని హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa