అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించ తలపెట్టిన 'యోగాంధ్ర' కార్యక్రమం ద్వారా ఒక చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 21న జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో, ఏర్పాట్లపై రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ అపూర్వ ఘట్టం కోసం యావత్ ప్రపంచం విశాఖ వైపు చూస్తోందని, అధికారులు పూర్తి పట్టుదల, నిబద్ధతతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.ఆంధ్రా యూనివర్సిటీలోని సాగరిక కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం మనందరి బాధ్యత. ఇది రాష్ట్ర ప్రజలందరి కార్యక్రమం, కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు భాగస్వాములు కావాలి" అని పిలుపునిచ్చారు. యోగా వల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రధాని మోదీ చెబుతున్న విషయాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ఈ నెల 21న ఉదయం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున 247 కంపార్ట్‌మెంట్లలో ఈ యోగా కార్యక్రమం జరగనుంది. ఉదయం 6:30 గంటలకు ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం వద్ద ఉన్న ప్రధాన ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారని, అంతకు గంట ముందే ప్రజలంతా నిర్దేశిత కంపార్ట్‌మెంట్లకు చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. "ప్రజలను వాహనాలనుంచి 600 మీటర్లకు మించి నడిపించవద్దు. వారిని ఇళ్ల నుంచి ప్రాంగణానికి చేర్చడం దగ్గర నుంచి, తిరిగి సురక్షితంగా ఇళ్లకు చేరే వరకు అధికారులదే బాధ్యత. జూన్ 19, 20, 21 తేదీలు చాలా కీలకం. అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, సమష్టిగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని లోకేశ్ స్పష్టం చేశారు. సమావేశానికి ముందు ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న యోగా శిక్షణను మంత్రి పరిశీలించారు.రాష్ట్రస్థాయి నోడల్ ఆఫీసర్‌గా నియమితులైన ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లు పక్కాగా జరుగుతున్నాయని తెలిపారు. "ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక గెజిటెడ్ అధికారిని బాధ్యుడిగా నియమించాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిని క్యూఆర్ కోడ్ ద్వారా నిర్దేశిత కంపార్ట్‌మెంట్లలోకి అనుమతిస్తాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారిని రాత్రి 2 గంటల నుంచే అనుమతిస్తాం" అని ఆయన వివరించారు. వాహనాల క్రమబద్ధీకరణకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 1200 కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 30 ప్రధాన లోకేషన్లతో పాటు, మరో 18 అదనపు లోకేషన్లలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.కార్యక్రమ నిర్వహణ కోసం 2 వేల మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లకు బాధ్యతలు అప్పగించామని, వారిని ముందురోజు రాత్రే ఏయూ గ్రౌండ్స్‌కు రప్పిస్తామని కృష్ణబాబు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా 116 అంబులెన్స్‌లను, 1400 బయో టాయిలెట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. హాజరయ్యేవారందరికీ మ్యాట్లు, టీషర్టులు ఆయా కంపార్ట్‌మెంట్ల వద్దే అందిస్తామని పేర్కొన్నారు. విశాఖతో పాటు పరిసర జిల్లాల నుంచి ప్రజల కోసం 3,500 ఆర్టీసీ బస్సులు, 8 వేల ప్రైవేటు, స్కూలు బస్సులను సిద్ధం చేశామని, సచివాలయ ఉద్యోగులకు ప్రజల సురక్షిత రవాణా బాధ్యతలు అప్పగించామని ఆయన వివరించారు.ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. హరీంద్రప్రసాద్, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa