ప్రపంచ దేశాల ముందు తరచూ తమ పరువును తీసుకోవడంలో పాకిస్తాన్ ముందుంటుంది. చాలా విషయాల్లో అనవసర వ్యాఖ్యలు చేయడం, అసత్యాలు చెప్పడం, గొప్పలకు పోయి.. తిప్పలు పడి అంతర్జాతీయ సమాజం ముందు జోకర్‌గా నిలవడం ఆ దేశానికి అలవాటే. అయితే ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలో జూన్ 14వ తేదీన జరగనున్న సైనిక పరేడ్‌కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు ఆహ్వానం అందిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను తాజాగా వైట్ హౌస్ ఖండించింది. ఈ వేడుకలకు ఏ విదేశీ సైనిక నాయకుడిని తాము ఆహ్వానించలేదని స్పష్టం చేసింది.
అయితే పాక్ ఆర్మీ చీఫ్‌కు అమెరికా ఆహ్వానం పలికిందన్న వార్తలు భారత్‌లో దౌత్యపరంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దౌత్యపరంగా ఎదురుదెబ్బ అని విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి. ఈ గందరగోళం మధ్య తాజాగా భారత్‌తో తమ వ్యూహాత్మక సంబంధాల గురించి.. అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ యూఎస్ మిలటరీ కార్యక్రమం అమెరికా సాయుధ దళాల 250వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఇదే రోజున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను అమెరికా ఆహ్వానించిందన్న వార్తలు తప్పు అని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా సాయుధ దళాల వార్షికోత్సవానికి ఏ దేశ సైనిక నాయకులను ఆహ్వానించలేదని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు. అసిమ్ మునీర్ గౌరవ అతిథిగా ఈ ఆర్మీ వేడుకలకు హాజరవుతారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా నుంచి అసిమ్ మునీర్‌కు అమెరికా అధికారిక ఆహ్వానం అందించిందని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొన్న తర్వాత వైట్ హౌస్ ఈ క్లారిటీ ఇచ్చింది.
భారత్, పాకిస్తాన్ మధ్య ప్రస్తుతం దౌత్యపరంగా తీవ్ర గందరగోళం మధ్య.. భారత్‌కు అమెరికా సీనియర్ అధికారులు తమ బలమైన మద్దతును మరోసారి వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని భారత ఎంపీల ప్రతినిధి బృందంతో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ క్రిస్టోఫర్ లాండౌ సమావేశమయ్యారని.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి వెల్లడించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడంలో రెండు దేశాల నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు.
అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా.. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలు ముఖ్యమని తెలిపారు. రెండు దేశాలతో భద్రతా సంబంధాలను కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను ఆయన వెల్లడించారు. 2021 కాబూల్ ఎయిర్‌పోర్టు బాంబు దాడిలో పాల్గొన్న ఐసిస్-కే ఉగ్రవాది మహమ్మద్ షరీఫుల్లాను అరెస్టు చేయడంలో పాకిస్తాన్ సైన్యం పాత్రను ఆయన గుర్తు చేస్తూ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో అమెరికా భాగస్వామ్యం.. భారత్‌తో సంబంధాలను బలహీనపరచాల్సిన అవసరం లేదని మైఖేల్ కురిల్లా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa