ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో అమెరికాతో మాట్లాడేది లేదు!.. తేల్చి చెప్పిన ఇరాన్

international |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 08:30 PM

ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయెల్ వందకు పైగా బాంబులతో విరుచుకుపడింది. అదే స్థాయిలో ఇరాన్ ప్రతిస్పందించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇప్పటికైనా తమతో అణు ఒప్పందంపై చర్చలకు రావాలని చెప్పారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ స్పందించింది. తమ అణు కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరపడం ఇక అర్థరహితమని పేర్కొంది. తమపై దాడి చేసేందుకు ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు పలికిందని ఆరోపించింది.


అమెరికా వైఖరిపై ఇరాన్ అభ్యంతరం..


అమెరికా ఒకవైపు ఇరాన్‌పై దాడులకు మద్దతునిస్తూనే.. మరోవైపు అణు ఒప్పందంపై చర్చలకు ఆహ్వానించడం సరైన చర్య కాదని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై పేర్కొన్నారు. అమెరికా అనుమతి లేకుండా ఇజ్రాయెల్ తమపై దాడి చేసే అవకాశమే లేదని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు ఇరుదేశాల మధ్య 5 సార్లు చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం ఆరోసారి చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతాయా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది.


అయితే, ఇరాన్, అమెరికా మధ్య అణు ఒప్పందంపై సూదీర్ఘ కాలంగా చర్చలు జరుగుతున్నాయి. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాలు, విద్యుత్ ఉత్పత్తి కోసమే అని ఇరాన్ వాదిస్తుండగా.. పశ్చిమ దేశాలు (ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్) అణ్వాయుధాల తయారీకి రహస్య ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించాయి. ఫలితంగా ఐక్యరాజ్యసమితి, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఇరాన్‌పై తీవ్ర ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో 2000ల మధ్యలో ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి వచ్చింది. దీంతో P5+1 దేశాలతో (చైనా, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా) పాటు యూరోపియన్ యూనియన్ (EU) ఇరాన్‌తో చర్చలు ప్రారంభించాయి. సుదీర్ఘ చర్చల తరువాత 2015లో ఇరాన్, P5+1 దేశాల మధ్య జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ (JCPOA) ఒప్పందం కుదిరింది.


ఈ ఒప్పందం ప్రకారం.. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. యురేనియం శుద్ధి పరిమితులను పాటించాలి. సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యను తగ్గించుకోవాలి. ఇరాన్ అణు కేంద్రాలపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలను నిర్వహించడానికి అనుమతించాలి. దీనికి ప్రతిగా ఇరాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను పాక్షికంగా లేదా పూర్తిగా ఎత్తివేయాలి. అయితే 2018లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో JCPOA నుంచి అమెరికా బయటకు వచ్చింది. అనంతరం ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ కూడా ఒప్పందాన్ని బేఖాతరు చేస్తూ.. యురేనియం శుద్ధి స్థాయిని పెంచడం, కొత్త సెంట్రిఫ్యూజ్‌లను తయారు చేయడం మొదలు పెట్టింది.


మళ్లీ మొదటికొచ్చిందా..


2021లో బైడెన్ అధికారంలోకి వచ్చి ఇరాన్‌తో చర్చలను మళ్లీ కొనసాగించాలని చూశారు. అయితే తమపై ఉన్న ఆంక్షలను పూర్తి ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇటీవల, ఒమన్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్.. ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లు అయింది. ఇరాన్ తాజా ప్రకటనతో ఈ చర్చలు పూర్తిగా ఆగిపోయే అవకాశమూ లేకపోలేదు. దీంతో ఇరాన్ మళ్లీ తన అణు కార్యక్రమాన్న మొదలుపెట్టే చేసే అవకాశం కూడా ఉంది. ఇరాన్ అణు ఒప్పందంపై ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa