చారిత్రాత్మక పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా సర్వసన్నద్ధమైతోంది. ఈ నెల 27వ తేదీన రథయాత్ర ఆరంభం కానుంది. బలభద్రుడు, సుభద్రతో కలిసి జగన్నాథుడి ఊరేగింపు కనులారా తిలకించడానికి దేశ, విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోనున్నారు. వారి కోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. జగన్నాథ రథయాత్ర 2025 ఒక పండుగ మాత్రమే కాదు.. ఇదొక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రధాన ఆలయంతో పాటు పూరీ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలను దర్శించడం వల్ల శాంతి, భక్తి, దైవిక అనుభూతిని కలిగిస్తాయి. జగన్నాథుడి రథయాత్రను తిలకించడానికి వెళ్లే భక్తులు.. పూరితో పాటు పలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. తప్పనిసరిగా సందర్శించవలసిన ఆరు చారిత్రాత్మక ఆలయాల వివరాలు ఇవీ.. శ్రీ జగన్నాథ దేవాలయం పూరీకి ఆత్మ వంటిది. రథయాత్రకు ఇది కేంద్ర స్థానం. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో పూజలందుకుంటున్నాడు. అతి ఎత్తైన గోపురం.. ఈ ఆలయం ప్రత్యేకత. రోజూ వేలాది మందికి అన్నదానం చేస్తారు. దానికోసం అతి భారీ వంటగది ఇక్కడ ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు జగన్నాథుడి దర్శనానికి వస్తుంటారు. గుండిచా దేవాలయాన్ని జగన్నాథుని గార్డెన్ హౌస్ గా పిలుస్తారు. రథయాత్ర సమయంలో స్వామివారు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. పండుగ సమయంలో ఈ దేవాలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఏడు రోజుల పాటు ఇది జగన్నాథునికి తాత్కాలిక నివాసంగా మారుతుంది. జగన్నాథ దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందీ ఆలయం. లోక్‌నాథ్ దేవాలయం లోక్‌నాథ్ దేవాలయం పూరీ శివార్లల్లో ఉంది. ఇది ప్రఖ్యాత శైవక్షేత్రం. పరమశివుడు కొలువుదీరాడిక్కడ. ఇక్కడ శివలింగం నీటిలో మునిగిపోయి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కనిపిస్తుంది. రథయాత్ర ప్రారంభానికి ముందు జగన్నాథుడే స్వయంగా ఇక్కడికి రహస్యంగా వస్తాడని భక్తులు నమ్ముతారు. మార్కండేశ్వర దేవాలయం జగన్నాథ దేవాలయానికి దగ్గరగా ఉన్న ఈ ఆలయాన్ని మార్కండేయ మహర్షి నిర్మించారని భక్తులు విశ్వసిస్తారు. ఆలయం దగ్గరలోని పవిత్రమైన కొలనులో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రథయాత్ర వైభవాన్ని చూసే ముందు మార్కండేయ ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అలర్‌నాథ్ దేవాలయం పూరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మగిరిలో ఈ ఆలయం ఉంది. రథయాత్ర సందర్బంగా ప్రధాన ఆలయంలో జగన్నాథుడి విగ్రహాలు దర్శనానికి అందుబాటులో లేనప్పుడు, భక్తులు ఇక్కడ విష్ణువును అలర్‌నాథ్ రూపంలో ఆరాధిస్తారు. నరేంద్ర ట్యాంక్ఒడిశాలోని అతిపెద్ద పవిత్రమైన పుష్కరిణిల్లో ఇదీ ఒకటి. రథయాత్రకు కొన్ని వారాల ముందు ఇక్కడ చందన యాత్ర జరుగుతుంది. ఆలయాల మధ్య ఉన్న ఈ పుష్కరిణి.. పూరీకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa