అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం.. వందల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగి 72 గంటలు పూర్తి అయినా.. కొందరి మృతదేహాలు ఇంకా గుర్తించలేదు. దీంతో ఇప్పటికే విమానం కూలిన ఘటనలో తమకు కావాల్సిన వారిని కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్న కుటుంబ సభ్యులకు.. కనీసం వారి మృతదేహాలు కూడా అందకపోవడంతో మరింత బాధలో కూరుకుపోతున్నారు. ఈ క్రమంలోనే విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు.. మృతదేహాల గుర్తింపు కోసం పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలోనే ఈ ప్రమాదంలో చనిపోయిన 22 ఏళ్ల యువతి ఆచూకీ కోసం.. ఆమె మేనమామ మిస్త్రీ జిగ్నేష్, ఆయన కుటుంబం ఈ నెల 12వ తేదీ నుంచి అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు.
డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత 72 గంటల్లో మృతదేహాన్ని అప్పగిస్తామని అధికారులు మిస్ర్తీ జిగ్నేష్‌కు మొదట చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా ఘటనా స్థలంలో ఇంకా కొన్ని మృతదేహాల కోసం గాలింపు చేపడుతుండటం.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చని జిగ్నేష్‌కు అధికారులు వెల్లడించారు. తన మేన కోడలు అవశేషాలు ఇంకా దొరక్కపోతే ఎలా.. ఇలా వేచి ఉండటం తమను తీవ్రంగా బాధిస్తోందని జిగ్నేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జిగ్నేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు వెల్లడించారు.
మరోవైపు.. బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలడంతో అందులోని విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 35 మందికిపైగా విద్యార్థులు మరణించారు. ఇక విమానం ఢీకొన్న క్యాంటీన్ సహా హాస్టల్‌లోని 4 వార్డులను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. దీంతో హాస్టల్ బ్లాక్‌లలో ఉన్న విద్యార్థులు కూడా ఖాళీ చేసి తమ ఇళ్లకు వెళ్లిపోవడం ప్రారంభించారు. ఒక వార్డులో ముగ్గురు మాత్రమే ఉండగా.. మిగిలిన వారు ఇంటికి వెళ్లిపోయారని హాస్టల్ విద్యార్థులు చెబుతున్నారు. విమానం కూలిన ఘటన వారిని తీవ్రంగా కదిలించిందని.. ఉన్నవాళ్లు కూడా వెళ్లిపోతారని పేర్కొంటున్నారు. మరోవైపు.. ఈ విమానం కూలిన ఘటనపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విమానంలోని బ్లాక్ బాక్స్ దొరికినప్పటికీ.. విమాన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
అయితే ఆస్పత్రిలో డీఎన్‌ఏ పరీక్షలు చేసి మృతదేహాలను గుర్తించి.. వారి కుటుంబాలకు అప్పగించేందుకు డాక్టర్లు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఎక్కువగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం ఇప్పుడు డాక్టర్లకు పెద్ద కష్టంగా మారింది. మృతదేహాల గుర్తింపులో ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడాలని.. ప్రతి కుటుంబానికి వారి బంధువుల శరీరాలే అందేలా చూడాలని గాంధీనగర్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ డైరెక్టర్ హెచ్‌పీ సంఘ్వి తెలిపారు. డీఎన్‌ఏ పరీక్షకు సమయం పడుతుందని.. పేలుడు కారణంగా చాలామంది డీఎన్‌ఏ దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని ఆయన చెప్పారు. ఇక ఫోరెన్సిక్ దంత వైద్యుడు జైశంకర్ పిళ్ళై మాట్లాడుతూ.. తన టీమ్.. మృతదేహాల దంతాలను కూడా చెక్ చేస్తోందని.. బాగా కాలిపోయిన శరీరాల నుంచి డీఎన్‌ఏ సేకరించడానికి ఇదే చివరి ఏకైక మార్గం కావచ్చని ఆయన తెలిపారు.
మరోవైపు.. మృతదేహాల కోసం వారి కుటుంబ సభ్యులు నిరీక్షిస్తుండటం వారిని మానసికంగా ఇంకా కుంగదీస్తోంది. చాలామంది మీడియాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడటం లేదు. తమ కుటుంబ సభ్యులకు చెందిన మిగిలి ఉన్న శరీరభాగాలను అయినా ఇంటికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నారు. తాము ఏమీ చెప్పలేమని.. మాటలు కూడా రావడం లేదని పోస్ట్ మార్టం వద్ద బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa