ప్రతి మహిళ తల్లి కావాలని కలలు కంటుంది. ఇది ప్రతి స్త్రీకి చాలా ఆనందాన్ని కలిగించే అనుభూతి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు స్త్రీ అనేక సమస్యల్ని ఎదుర్కొంటుంది. మానసిక స్థితిలో మార్పులు, దద్దుర్లు, బరువు పెరగడం, పాదాల్లో వాపు వంటి అనేక సమస్యల్ని ఎదుర్కోవాలి. ఇక, ప్రసవం తర్వాత ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రసవం తర్వాత కూడా మహిళలు సమస్యలు తగ్గవు. ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలు బరువు పెరుగుతారు.
ప్రసవం తర్వాత మహిళల్లో ఊబకాయం సమస్య కనిపిస్తుంది. ప్రసవం తర్వాత మహిళలు బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడతారు. బెల్లీ ఫ్యాట్ కారణంగా, మహిళల అందం కూడా చెడిపోతుంది. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. అలాంటి మహిళలకు కోసం కొన్ని ప్రభావంతమైన వ్యాయామాలు ఉన్నాయి. ఈ వ్యాయామాలు రెగ్యులర్‌గా చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఆ వ్యాయామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లోతైన శ్వాస వ్యాయామం
లోతైన శ్వాస వ్యాయామం.. ఇది శ్వాసను నియంత్రించే ఒక పద్ధతి. ఇది మన ఛాతీ ద్వారా కాకుండా ఊపిరితిత్తుల కింద ఉండే ప్రధాన శ్వాస కండరాన్ని ఉపయోగించి లోతైన శ్వాస తీసుకోవడం దృష్టి పెడుతుంది. ఈ వ్యాయామాన్ని కూర్చుని లేదా పడుకుని చేయవచ్చు. ముక్కు ద్వారా నెమ్మదిగా, లోతుగా గాలిని పీల్చండి. ఇలా చేస్తున్నప్పుడు మీ బొడ్డు పైకి లేచినట్టుగా అనుభూతి చెందాలి. ఆ తర్వాత ఛాతీ కదలకుండా చూసుకోండి. ఊపిరితిత్తులు గాలితో నిండినట్టు పూర్తిగా పీల్చుకోండి. కొన్ని సెకన్ల పాటు శ్వాసను పట్టి ఉంచండి. ఆ తర్వాత శ్వాసను వదలండి. ఇలా చేస్తున్నప్పుడు మీ బొడ్డు లోపలికి వెళ్లినట్టుగా అనుభూతి చెందాలి. ఈ వ్యాయామాన్ని ఐదు నుంచి పది నిమిషాలు చేయవచ్చు. రోజుకు 2 నుంచి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
వాకింగ్
వాకింగ్ ఎవరైనా సరే చేయగలిగే ఈజీ వ్యాయామం. ప్రసవం తర్వాత మీరు బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతుంటే వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ప్రసవం తర్వాత ముందు తేలికపాటి నడకతో ప్రారంభించండి. ఆ తర్వాత రోజు రోజూ వాకింగ్ స్పీడ్, అడుగులు, దూరం పెంచుకుంటూ పోండి. వాకింగ్ ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయం అరగంట, సాయంత్రం ఓ అరగంట వాకింగ్ చేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు.
బ్రిడ్జెస్
ఈ వ్యాయామం కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది పొట్ట, వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది. ఇందుకోసం ముందుగా మీ వీపును నేల మీద ఆనించి.. మోకాళ్లు వంచి.. పాదాలు నేల మీద ఆన్చి పడుకోండి. శ్వాస తీసుకుంటూ హిప్స్ పైకి ఎత్తండి. శరీరం మోకాళ్ల నుంచి భుజాల వరకు ఒకే సరళరేఖలో ఉండేలా చూసుకోండి. కొద్దిసేపు ఆగి.. ఆ తర్వాత నెమ్మదిగా కిందికి రండి. ఇలా ఈ వ్యాయామాన్ని పది నుంచి 15 సెట్ల పాటు చేయండి.
సైక్లింగ్
బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువు తగ్గడానికి సైక్లింగ్ ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు చెప్పారు. సైక్లింగ్ వల్ల బరువు తగ్గడంతో పాటు ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ సైకిల్ తొక్కడం వల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. సైకిల్ తొక్కడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది బొడ్డు కొవ్వును తగ్గించడమే కాకుండా.. మీ శరీరాన్ని మంచి ఆకృతిలో తీసుకువస్తుంది. రోజుకు కనీసం ముప్పై నిమిషాలైనా ఈ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయని నిపుణులు అంటున్నారు.
ప్లాంక్
ప్రసవం తర్వాత పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగించడానికి ప్లాంక్ వ్యాయామం బెస్ట్ ఆప్షన్. ఈ వ్యాయామం రోజూ 10 నిమిషాలు చేయడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది. జీవక్రియ వేగవంతం అవ్వడం వల్ల కొవ్వు త్వరగా బర్న్ అవతుంది. ఈ వ్యాయామం చేయడం వల్ల కేలరీలు త్వరగా బర్న్ అయి బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ముఖ్య విషయాలు
* ప్రసవం తర్వాత చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడతారు. ఇది సహజం. అయితే, దీన్ని తగ్గించుకోవడానికి కొంత సమయం పడుతుంది.
* మీరు ఏ వ్యాయామం అయినా సరే ప్రారంభించేముందు మీ డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సిజేరియన్ అయిన వారికి వైద్యుల సలహా ముఖ్యం.
* ఈ వ్యాయామాలతో పాటు సమతుల్య ఆహారం, తగినంత నీరు తాగడం, నిద్ర పోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa