ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దండకారణ్య ప్రాంతంలోని పొదకొర్మ గ్రామంలో వారు నిర్వహించిన తమ స్వీయ ప్రజాకోర్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఇన్‌ఫార్మర్లుగా అనుమానించి ఉరితీశారు. ఈ ఘటన జూన్ 17, 2025 సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిందని, మృతులను జింగు మోడియం, సోమ మోడియం, అనిల్ మండావిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ దారుణ హత్యలు స్థానికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి. మావోయిస్టులు ఈ హత్యలతో పాటు ఏడుగురు గ్రామస్తులపై దాడి చేసి గాయపరిచారు, మరో 12 మందిని కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ దాడిని మావోయిస్టు కమాండర్ వెల్లా నేతృత్వంలో జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన సమీపంలో భద్రతా బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్న సమయంలో జరగడం గమనార్హం.
ఈ హత్యల వెనుక మావోయిస్టు కమాండర్ దినేష్ మోడియం ఇటీవల పోలీసులకు లొంగిపోవడమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. దినేష్ లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి దెబ్బగా మారిందని, అందుకే అతని బంధువులను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించి, కిడ్నాప్ అయిన వారి కోసం గాలింపు చేపట్టారు. బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు హింస కొనసాగుతుండగా, భద్రతా బలగాలు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa