ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నుల వసూళ్లలో అవగాహన కల్పించాలన్న సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 19, 2025, 09:09 AM

పన్నుల వసూళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పన్నుల వసూళ్లపై అవగాహన కల్పించాలని, వేధింపులు వద్దని అధికారులకు సూచించారు. వ్యవస్థలోని లొసుగులను వాడుకుని రెవెన్యూకు గండి కొడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అదే సమయంలో పన్ను వసూళ్లలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లకు సంబంధించి వారిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పన్ను చెల్లింపులకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సీఎం సూచించారు.ఎగవేత దారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేస్తామని సీఎం చెప్పారు. ప్రజల నుంచి సంతృప్తి వ్యక్తం కావటమే కూటమి ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. మరోవైపు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత చేయగలుగుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ, వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషనర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు.పన్ను వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధించటంపై చిత్తూరు, కర్నూలు, కాకినాడ, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్లను సీఎం అభినందించారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తేనే సమస్యలు తొలగుతాయని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ప్రక్రియ జరగకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి శాశ్వతంగా ఇబ్బందుల్లో పడుతుందని చెప్పారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల నుంచి రాష్ట్ర ఆదాయానికి తోడ్పడేలా రెవెన్యూ ఆర్జన పెరిగేలా చూడాలని చంద్రబాబు సూచించారు.గతేడాదితో పోలిస్తే రెవెన్యూ వసూళ్లు పెరిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో 2025 ఏప్రిల్ నెలలో రూ. 906.12 కోట్లు, మే నెలలో రూ.916 కోట్ల మేర వసూళ్లు అయ్యాయని అధికారులు వివరించారు. గతేడాది ఇదే సమయానికి ఏప్రిల్ నెలలో రూ. 663.29 కోట్లు, మే నెలలో రూ.583 కోట్ల మేర ఉన్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమంగా పెరుగుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. జీఎస్టీ, వాణిజ్య పన్నుల రాబడి 5.71 శాతం మేర పెరిగాయని స్పష్టం చేశారు. జీఎస్టీ, వాణిజ్య పన్నులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 43,020 కోట్ల మేరకు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.నూతన మద్యం విధానం ద్వారా వ్యవస్థను పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నూతన మద్య విధానం అమలు అనంతరం రాష్ట్రానికి రూ.2,432 కోట్ల మేర ఆదాయం పెరగనున్నట్టు సీఎంకు అధికారులు వివరించారు. గనుల శాఖలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపగ్రహ సమాచారాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఖనిజాలు, ఇసుక తవ్వకాలకు సంబంధించి ఖచ్చితమైన డేటాను సేకరించడంతో పాటు ఆదాయం ఆర్జించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. తద్వారా 30 నుంచి 40 శాతం మేర అదనంగా ఆదాయాలు పెంచుకోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు రాష్ట్రంలో అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్ర చందనం విక్రయానికి సంబంధించి అంతర్జాతీయంగా ఉన్న ధరల్ని బేరీజు వేయాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.ఆదాయార్జనలో కీలకమైన శాఖలు, విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సరైన వ్యక్తులు సరైన చోట్ల ఉంటేనే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతామని ఆయన అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను సాధించగలిగిన వారు సరైన స్థానాల్లో ఉండాలని స్పష్టం చేశారు. దీనిపై కసరత్తు చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన సేవలు మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలని సీఎం స్పష్టం చేశారు. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa