ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకోవద్దని, అలా అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికాను రష్యా హెచ్చరించింది, ఇజ్రాయేల్‌కు మద్దతుగా అమెరికా సైన్యం రంగంలోకి దిగనుందనే వార్తలు వస్తోన్న వేళ రష్యా స్పందించింది. రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ రయబ్కోవ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయేల్‌కు నేరుగా సైనిక సహాయం అందించవద్దని అమెరికాను హెచ్చరించారు. ‘అలాంటి ఊహాలు, సైద్ధాంతిక అవకాశాలపైనా వాషింగ్టన్ జాగ్రత్తగా ఉండాలని మేము హెచ్చరిస్తున్నాం. ఇది మొత్తం పరిస్థితిని తీవ్ర అస్థిరతకు గురిచేసే చర్య అవుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇరాన్‌కు మద్దతు ఇస్తోన్న రష్యా.. ఇజ్రాయేల్ దాడులు ఇప్పటికే ఖండించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఇరాన్, ఇజ్రాయేల్ పరస్పరం ఒకరిపై ఒకరు మిస్సైళ్లు, డ్రోన్లు ప్రయోగించుకుంటున్నాయి. తమ దాడులకు ఇరాన్ అణ్వాయుధ ప్రణాళికలను ఆపేందుకేనంటూ ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ యురేనియం శుద్ధి కేంద్రాలను ధ్వంసం చేసింది. టెహ్రాన్ అణు బాంబులు తయారు చేయకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) హెచ్చరించింది. ఆ వెంటనే ఇజ్రాయెల్ దాడులు చేసింది.
ఇజ్రాయెల్ అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ ప్లాంట్ ఉపగ్రహ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "రియాక్టర్ దగ్గరలో ఉన్న ప్రజలు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి" అని హెచ్చరించింది. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ప్రస్తుతానికి అక్కడ రేడియేషన్ ప్రమాదం ఏమీ లేదని సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే యురేనియం శుద్ధి కేంద్రాలపై దాడులు చేస్తోంది. టెహ్రాన్ అణుబాంబులు తయారు చేసేందుకు వాడుతున్న అన్ని వనరులను నాశనం చేయాలని ఇజ్రాయెల్ చూస్తోంది. ఐడీఎఫ్ దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి ఆటంకం కలుగుతోంది. అటు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సైతం అమెరికాను హెచ్చరించిన విషయం తెలిసిందే.
మరోవైపు, ఇరాన్ ఇజ్రాయెల్‌పై గురువారం క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో బీర్‌షెవాలోని సొరొక ఆస్పత్రి కూడా దెబ్బతింది. ఈ దాడిలో చాలా మంది గాయపడ్డారు. ఆస్పత్రి అంబులెన్స్ సర్వీస్ హెడ్ ఎలిబెన్ మాట్లాడుతూ.. ఆస్పత్రికి ఎవరూ రావద్దని.. నిన్ననే ఆ ఫ్లోర్‌ను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. ఇజ్రాయేల్‌లోని అతి ముఖ్యమైన ఆస్పత్రులలో ఇది ఒకటి. వాస్తవానికి, మొన్నటి వరకు ఆస్పత్రి చాలా రద్దీగా ఉండేది. కానీ, దాడి జరిగిన ఫ్లోర్‌ను నిన్ననే ఖాళీ చేయించారు. దీనితో చాలా మంది ప్రాణాలు కాపాడినట్టయ్యింది. ఇక, ఇరాన్‌తో యుద్ధం కారణంగా ఇజ్రాయేల్ భారీగానే నష్టపోతుంది. రోజుకు రూ.2,400 కోట్లు ఖర్చుచేస్తోంది.
ఇరాన్ డజన్ల కొద్దీ బాలిస్టిక్ మిసైల్స్‌ను ఉపయోగించిందని నిపుణులు చెబుతున్నారు. ఈ దాడిని యుద్ధ నేరంగా ఇజ్రాయేల్ ఆరోగ్యశాఖ మంత్రి ఉరియల్ బుసో అభివర్ణించారు. ఆయన మాట్లాడుతూ, "ఇది ఇరాన్ పాలకులు చేసిన నేరం. అమాయక ప్రజలను, ప్రాణాలు కాపాడే డాక్టర్లను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఆరోగ్య శాఖ ఇలాంటి వాటికి ముందే సిద్ధంగా ఉంది. వెంటనే స్పందించిన వారికి ధన్యవాదాలు" అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa