ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతిభద్రతల పరిరక్షణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సర్కార్ భావన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 23, 2025, 10:19 AM

రాష్ట్రంలో రాజకీయ అండదండలతో చెలరేగిపోతున్న రౌడీలు, సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేసేందుకు ఉత్తరప్రదేశ్ తరహాలో కఠిన చర్యలు తీసుకునే అంశంపై ప్రభుత్వ పెద్దల స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, యూపీలో అమలు చేస్తున్న వివాదాస్పద బుల్డోజర్ పాలన, ఎన్‌కౌంటర్లు కాకుండా నేర ప్రవృత్తిని అరికట్టే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో కొందరు రాజకీయ అండతో నేరాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు సవాల్ విసురుతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిని కట్టడి చేయకపోతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలవాటుగా నేరాలకు పాల్పడేవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయడం వంటి చర్యల ద్వారా వారి కుటుంబ సభ్యుల నుంచే ఒత్తిడి తీసుకురావచ్చని, తద్వారా వారిలో మార్పు వస్తుందని ఒక ఆలోచనగా ఉంది. మహిళలపై నేరాలకు పాల్పడితే రౌడీషీట్ తెరుస్తామని హోంమంత్రి అనిత.. గంజాయి-డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని మంత్రి లోకేశ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినా, కొందరు పెడచెవిన పెడుతున్నారు.ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్లతో ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ పథకాల నిలిపివేత, నగర బహిష్కరణ వంటి చర్యలతో అక్కడ నేరస్థులు భయపడిపోతున్నారు. అయితే, ‘బుల్డోజర్ న్యాయం’పై తీవ్ర విమర్శలు, కోర్టుల అభ్యంతరాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అలాంటి తీవ్ర చర్యలకు బదులుగా, చట్ట పరిధిలో నేరగాళ్లను కట్టడి చేసే మార్గాలపై అధికారులు దృష్టి .కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణ పనులు, పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయని, రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, కేంద్రం కూడా సహకరిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు చట్టప్రకారం పనిచేస్తూ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నారని, గంజాయి నియంత్రణకు ‘ఈగల్’, మహిళల భద్రతకు ‘శక్తి’ వంటి విభాగాలతో మార్పు కనిపిస్తోందని అంటున్నారు. అయితే, పోలీసు అధికారులను బెదిరించేలా కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో అరాచక శక్తులు మళ్లీ పేట్రేగే అవకాశం ఉందని, ఇలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదమని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.ఒకప్పుడు హైదరాబాద్‌లో మత ఘర్షణలు, రాయలసీమలో ఫ్యాక్షనిజం, కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాకే రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో, ఏపీలో నేర రహిత సమాజం కోసం ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa