వైసీపీ అధినేత జగన్ ఏదో పేరుతో రోడ్లపై బలప్రదర్శన చేస్తూ ప్రభుత్వాన్ని, పోలీసులను, ప్రజలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలు ఇందుకు తాజా నిదర్శనాలు. ఈ రెండూ విజయవంతమయ్యాయని వైసీపీ నేతలు, వారి సొంత మీడియా చెప్పుకుంటున్నాయి కనుక రాబోయే రోజుల్లో జగన్ ఇలాంటి మరిన్ని బలప్రదర్శనలు చేసే అవకాశం ఉంది. జగన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగంపై ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. "మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే?అనే మాట వింటున్నాను. వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. రానివ్వనని ఇదివరకు చెప్పాను. ఇప్పుడూ చెపుతున్నాను. మరో 15-20 ఏళ్ళ వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అధికారంలో కొనసాగుతుంది. కనుక వైసీపీ మళ్ళీ అధికారంలో వస్తే మా పరిస్థితి ఏమిటని ఎవరూ భయపడనవసరం లేదు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఎటువంటి కార్యక్రమాలు చేసుకున్నా ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఈవిదంగా రాళ్ళ దాడులు చేస్తాం.. అడ్డొస్తే తొక్కేస్తాం.. రప్పా రప్పా తలలు నరికేస్తాం.. అంటూ భీభత్సం సృష్టిస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తుంటే చూస్తూ ఊరుకోము. ఒక్కొక్కడికి మక్కెలు విరగ్గొట్టి లోపలేస్తాం. రాజకీయ పార్టీ ముసుగులో రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నవారిని ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం మీ వెనుక ఉంటుంది. కనుక మీరు నిర్భయంగా చట్ట ప్రకారం ముందుకు సాగండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు," అని పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ రెచ్చిపోవడానికి, ప్రభుత్వం మెతక వైఖరికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో వివేకా హత్య కేసు విచారణ ముందుకు సాగకుండా అడ్డుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఆ కేసు విచారణ ముందుకు సాగలేదు. నిందితులపై ఎటువంటి చర్య తీసుకోలేకపోయారు. మద్యం కుంభకోణం కేసులో అన్ని సాక్ష్యాధారాలు ప్రభుత్వం చేతిలో ఉన్నా జగన్ని టచ్ చేయలేకపోతున్నారు. 'సీజ్ ది షిప్' అంటూ హడావుడి చేసిన తర్వాత బియ్యం అక్రమ రవాణా కేసులు ఏమైందని? ఆ కేసులో నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కనుక ఈ 'మంచి ప్రభుత్వం' మనల్ని ఏమీ చేయలేదనే నమ్మకమే వైసీపీ రెచ్చిపోవడానికి కారణంగా కనిపిస్తోంది. అందువల్లే వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్నప్పటికీ, వాటిని ఎన్నికలలో తమకు టికెట్స్ సంపాదించిపెట్టే 'వీరతాళ్ళు'గా భావిస్తున్నారే తప్ప వాటిని చూసి ఎవరూ భయపడటం లేదు. అందుకే జగన్తో సహా వైసీపీలో ఎవరూ కూడా ప్రభుత్వాన్ని, పోలీసులను ఖాతరు చేయడం లేదు. ప్రభుత్వం మెతక వైఖరికి బహుశః కారణం ఏమిటంటే, జగన్ లేదా వైసీపీ నేతలపై తీవ్ర చర్యలు తీసుకుంటే ప్రజలలో వారి పట్ల సానుభూతి ఏర్పడుతుందేమో?అనే ఆలోచన కావచ్చు. లేదా మనది 'మంచి ప్రభుత్వం' అని ప్రజలు భావించాలంటే జగన్, వైసీపీ నేతలు తమ అసలు రూపాలని బయటపెట్టుకునేవరకు ఓపిక పట్టాలని ఎదురుచూస్తున్నారేమో? రప్పా రప్పా అంటూ జగన్, వైసీపీలు బయటపడ్డారు కనుక ఇకనైనా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa