ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో మహమ్మారి రానుందా,,,చైనాలో 22 కొత్త వైరస్‌లు.. రెండు అత్యంత ప్రమాదకరం

international |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 09:45 PM

కరోనా వైరస్ ధాటికి ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయింది. కేవలం ఆరోగ్య సంక్షోభాన్నే కాకుండా, ఆర్థిక, సామాజిక, మానసిక రంగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ప్రపంచ దేశాల ఆరోగ్య రంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కఠినమైన లాక్డౌన్లు, కర్ఫ్యూలు, ప్రయాణ ఆంక్షలు విధించాయి. విమానయానం, రైల్వేలు, రోడ్డు రవాణా స్తంభించిపోయాయి. ప్రజలు తమ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. మానవాళిని ఇంతటి ప్రమాదంలోకి నెట్టిన ఈ వైరస్‌.. మొట్టమొదటి కేసు 2019 డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో గుర్తించారు. మొదట్లో దీనిని "వుహాన్ కరోనావైరస్" అని పిలిచేవారు. అయితే ఇటీవల చైనాలో మరో 22 కొత్త వైరస్‌లను కొనుగొనడం ఆందోళనకు గురిచేస్తోంది.


చైనాలోని గబ్బిలాల్లో 22 కొత్త వైరస్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్‌లు పశువులు లేదా మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి 2021 మధ్య చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో 142 గబ్బిలాల కిడ్నీ కణజాలంలో 22 వైరస్‌లను గుర్తించారు. జన్యు విశ్లేషణ ద్వారా వీటిని గుర్తించారు. అయితే ఈ వైరస్‌ల్లో రెండు.. ప్రాణాంతకమైన హెండ్రా, నిపా హెనిపావైరస్‌లకు జన్యుపరంగా దగ్గరగా ఉన్నాయి. గతంలో తెలియని ఇతర బ్యాక్టీరియా జాతులు, పరాన్నజీవులు కూడా ఈ విశ్లేషణలో బయటపడ్డాయి.


ఈ గబ్బిలాలు గ్రామీణ ప్రాంతాల్లోని పండ్ల తోటల దగ్గర నివసిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఈ గబ్బిలాల మూత్రం ద్వారా హెనిపావైరస్‌లు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వెల్లడించారు. గబ్బిలాల ద్వారా కలుషితమైన పండ్లను మనుషులు లేదా జంతువులు తింటే.. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కాగా, ఇంతకుముందు తెలియని రెండు కొత్త వైరస్‌లకు.. యునాన్ బ్యాట్ హెనిపావైరస్ 1, 2 అని పేరు పెట్టారు.


"ఈ వైరస్‌లు ప్రధానంగా గబ్బిలాల కిడ్నీల్లో కనుగొన్నాం. ఇది మూత్ర ఉత్పత్తికి సంబంధించిన ప్రదేశం. గబ్బిలాల మూత్రంతో కలుషితమైన పండ్లు లేదా నీటి ద్వారా మానవులకు ఈ వైరస్‌లు సోకే ప్రమాదం ఉంది. అందుకే ఈ వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి" అని ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన మాలిక్యులర్ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ వినోద్ బాలసుబ్రమణ్యం తెలిపారు.


గతంలో హెనిపావైరస్‌ల వల్ల ప్రాణాంతక వ్యాధులు సంభవించాయి. కొత్తగా గుర్తించిన యునాన్ బ్యాట్ వైరస్‌లు.. ప్రమాదకరమైన హెనిపావైరస్‌ల వైరస్‌లతో 52 నుంచి 57 శాతం జన్యు పదార్థాన్ని పంచుకుంటాయి. మలేసియా వంటి నిపా సోకిన ప్రాంతాల వాతావరణం.. యునాన్‌ ప్రావిన్స్ క్లైమేట్‌కు దగ్గరగా ఉండటం వల్ల ఇది జూనోటిక్ వ్యాధులు వ్యాప్తి చెందడానికి అనువైన ప్రాంతమని బాలసుబ్రమణ్యం అన్నారు.


వైరస్‌లను కనుగొనడంతో పాటు, క్లోస్సియెల్లా యునాన్నెన్సిస్ అనే కొత్త ఏకకణ పరాన్నజీవిని రెండు అధికంగా ఉండే బ్యాక్టీరియా జాతులను కూడా గుర్తించారు. వాటిలో ఒకటి ఫ్లావోబాక్టీరియం యునాన్నెన్సిస్. గతంలో గబ్బిలాలపై జరిపిన వైరాలజీ అధ్యయనాలు.. మల నమూనాలపై దృష్టి సారించాయి. అయితే ఈ అధ్యయనంలో గబ్బిలాల అంతర్గత అవయవాలపై, ముఖ్యంగా కిడ్నీలపై దృష్టి సారించారు.


గబ్బిలాలలోని అధ్యయనం చేయని కణజాలాల్లో.. చాలా మైక్రోబియల్ థ్రెట్స్ పొంచిఉన్నాయని తాజా పరిశోధన స్పష్టం చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తద్వారా జూనోటిక్ ట్రాన్స్‌మిషన్ (zoonotic transmission- జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ఒక అంటు వ్యాధి) జరిగే అవకాశం ఉందటున్నారు.


గబ్బిలాల ద్వారా వచ్చే వైరస్‌లు.. ఎబోలా, మార్‌బర్గ్, SARS, MERS, COVID-19 వంటి అనేక ప్రధాన జూనోటిక్ వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యాయి. ఈ వ్యాధికారకాలు (pathogens ) నేరుగా లేదా ఇంటర్మీడియేట్ హోస్ట్స్ ద్వారా (కలుషితమైన ఆహారం లేదా నీటిని తీసుకోవడం) మానుషులకు వ్యాప్తి చెందుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa