ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అలూటియన్ దీవుల సమీపంలో కొత్త వాహనాలతో మెక్సికోకు వెళుతున్న ఒక భారీ కార్గో షిప్ (వాహన రవాణా ఓడ) అగ్నిప్రమాదానికి గురైన కొన్ని వారాల తర్వాత పూర్తిగా మునిగిపోయింది. ఈ ఘటన సముద్రయాన చరిత్రలో ఒక దుర్ఘటనగా నమోదు కాగా.. మొత్తంగా అందులో ఉన్న 3 వేల కార్లు నీట మునిగిపోయాయి.
జూన్ 3వ తేదీన ఈ కార్గో షిప్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అదుపు తప్పడంతో.. ఓడలో ఉన్న 22 మంది సిబ్బంది వెంటనే ఓడను విడిచి పెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ముఖ్యంగా వారికి సమీపంలో ఉన్న మర్చంట్ మెరైన్ అనే నౌక వారిని కాపాడింది. అప్పటి నుంచి అగ్నిప్రమాదానికి గురైన ఈ ఓడ పసిఫిక్ మహా సముద్రంలో నిస్సహాయంగా తేలియాడుతోంది. ఓడను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రోజుల తరబడి రగులుకున్న మంటలు ఓడ నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
అయితే తాజాగా ఈ ఓడ మునిగిపోయింది. అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా బలహీనపడిన ఓడ, వాతావరణ పరిస్థితులు మరియు సముద్ర ప్రవాహాల ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. చివరికి అలూటియన్ దీవులకు సమీపంలో ఉన్న ఉత్తర పసిఫిక్ జలాల్లో ఇది పూర్తిగా మునిగిపోయింది. ఈ ఓడలో మెక్సికోకు తీసుకెళ్తున్న 3 వేల కార్లు ఉండగా.. అందులో 800 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. పడవతో పాటు ఇవి కూడా పూర్తిగా నీట మునిగాయి. అయితే ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ముఖ్యంగా అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై సముద్ర భద్రతా అధికారులు విచారణ ప్రారంభించారు.
ఈ సంఘటన సముద్రయాన పరిశ్రమలో షిప్పింగ్ భద్రతపై, ముఖ్యంగా పెద్ద కార్గో షిప్‌లలో జరిగే అగ్నిప్రమాదాలను నియంత్రించడంపై తీవ్ర చర్చకు దారితీసింది. కొత్త తరం వాహనాల్లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలలో ఉండే బ్యాటరీలు అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని పెంచుతున్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయినప్పటికీ.. ఈ ప్రత్యేక ఘటనలో ఏ రకమైన వాహనాలు ప్రమాదానికి కారణమయ్యాయి అనే దానిపై ప్రస్తుతానికి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
మునిగిపోయిన ఈ ఓడ సముద్ర పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నూనె, ఇతర రసాయనాలు లీకయ్యే ప్రమాదం ఉంటే అది సముద్ర జీవులకు, పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ ఘటన కేవలం ఓడ మునక మాత్రమే కాదు, అంతర్జాతీయ వాణిజ్యం, సముద్రయాన భద్రత, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అనేక ప్రశ్నలను లేవనెత్తింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ దుర్ఘటన మరోసారి స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa