ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుల్‌బుల్ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు భారత్ యోచన

national |  Suryaa Desk  | Published : Thu, Jun 26, 2025, 05:54 PM

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో సింధూ జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న తుల్‌బుల్ నావిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి, పశ్చిమంగా ప్రవహించే నదుల నీటిని మరింత సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.అధికార వర్గాల సమాచారం ప్రకారం, తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్చలు తుది దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ తయారీ పనులు జరుగుతున్నాయని, ఏడాదిలోగా ఇది పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జీలం నదిపై  నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయితే నీటి రవాణాకు, నిల్వకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.పశ్చిమ దిశగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల జలాల్లో భారత్‌కు ఉన్న వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అనేక ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. వీటిలో భాగంగా, ఈ నదుల్లో ఒకదాని నుంచి కొంత నీటిని పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు మళ్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.భారత్, పాకిస్థాన్ మధ్య 1960లో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం, పశ్చిమంగా ప్రవహించే సింధు, దాని ఉపనదులైన చీనాబ్, జీలం నదులపై భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ నదీ వ్యవస్థలోని మొత్తం నీటిలో దాదాపు 20 శాతం భారత్, 80 శాతం పాకిస్థాన్ వినియోగించుకునేలా ఒప్పందం జరిగింది. అయితే, ఈ నదులపై భారత్‌కు కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునే సామర్థ్యం తక్కువగా ఉండటం ఒక సవాలుగా మారిందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో అధికంగా వచ్చే నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల ఆ నీరు దిగువన ఉన్న పాకిస్థాన్‌కు తరలిపోతోందని వారు పేర్కొన్నారు.గతంలో, ఈ ఒప్పందం అమలు వల్ల వరదల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రస్తుతం రిజర్వాయర్ల నిర్వహణ, నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆ అధికారి వివరించారు. పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, కిషన్‌గంగ జల విద్యుత్ ప్రాజెక్టును భారత్ విజయవంతంగా పూర్తి చేసింది. అదేవిధంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa