ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీకు ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ సమస్యలు ఉంటే కనిపించే లక్షణాలు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 11:03 PM

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. అయితే, బిజీ లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా చాలా మంది అనేక రకాల వ్యాధులతో పోరాడుతున్నారు. అయితే చాలా మంది ఎక్కువగా కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. సాధారణంగా హై కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ సమస్యల్ని సైలెంట్ డిసీజ్స్ అంటారు. ఎందుకంటే ఈ రెండు ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లక్షణాలు తక్కువగా ఉండటం వల్ల వీటిని గుర్తించడం చాలా కష్టం. అయితే, ఉదయం పూట ఈ రెండు వ్యాధులకు సంబంధించి కొన్ని లక్షణాలు కనబడతాయని నిపుణులు అంటున్నారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అధిక కొలెస్ట్రాల్


కొలెస్ట్రాల్ అనేది మన శరీరానికి అవసరమైన ఒక రకమైన కొవ్వు పదార్థం. కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే. అయితే, ఇది పెరిగేతే మాత్రం ఆరోగ్యానికి హానికరం. సాధారణంగా కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL), చెడు కొలెస్ట్రాల్ (LDL). చెడు కొలెస్ట్రాల్ వల్ల ఆరోగ్యానికి చాలా ముప్పు. ఇది రక్త నాళాల గోడలపై పేరుకుపోయి, ధమనులను గట్టిపరుస్తుంది. దీంతో అవి ఇరుకుగా మారతాయి.దీనివల్ల గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే చెడు కొలెస్ట్రాల్ గుర్తించాలి. చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఉదయం పూట కనిపించే లక్షణాలేంటో ఓ లుక్కేద్దాం.


అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు


* కాళ్లలో నొప్పి, తిమ్మిరి లేదా బలహీనత: కొలెస్ట్రాల్ పెరగడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాళ్ళలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఉదయం నిద్ర లేవగానే లేదా నడిచేటప్పుడు కాళ్లలో నొప్పి, తిమ్మిరి లేదా బలహీనత వంటి లక్షణాల్ని అనుభూతి చెందవచ్చు.


* పాదాలు చల్లగా అనిపించడం: రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల చేతులు, పాదాలు చల్లగా అనిపించవచ్చు. ఇది ఉదయం పూట మరింత స్పష్టంగా ఉండవచ్చు.


* చేతులు, కాళ్ళు పసుపు రంగులోకి మారడం: సాధారణంగా కొలెస్ట్రాల్ వల్ల చేతులు, కాళ్ళపై లేదా కనురెప్పలపై పసుపు రంగు మచ్చలు ఏర్పడవచ్చు. వీటిని శాంథెలాస్మా లేదా జాంతోమాస్ అంటారు. ఇవి ఉదయం పూట అద్దంలో చూసుకున్నప్పుడు గమనించవచ్చు.


* అలసట: రాత్రి బాగా విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా ఉదయం అలసటగా అనిపించడం హై కొలెస్ట్రాల్ సంకేతం కావచ్చు. ఎందుకంటే శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలా జరుగుతుంది.


* శ్వాస ఆడకపోవడం: తేలికపాటి శ్రమ చేసినా, ఉదయం పూట మెట్లు ఎక్కేటప్పుడు లేదా సాధారణ పనులు చేస్తున్నప్పుడు శ్వాస ఆడకపోవడం అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల ప్రారంభ సంకేతం కావచ్చు.


ఫ్యాటీ లివర్


​ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫ్యాటీ లివర్ అనేది కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోయే ఒక సాధారణ పరిస్థితి. కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉండటం సాధారణమే, కానీ అది కాలేయ బరువులో 5-10% మించి ఉన్నప్పుడు, అది ఫ్యాటీ లివర్‌గా పరిగణించబడుతుంది. ఇది రెండు రకాలు. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మద్యం సేవించే వారిలో వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ మద్యం సేవించని వారిలో కనిపిస్తుంది. ఫ్యాటీ లివర్‌ని నిర్లక్ష్యం కాలేయం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ ఉంటే ఉదయం కనిపించే లక్షణాలేంటో తెలుసుకుందాం.


ఫ్యాటీ లివర్ లక్షణాలు


* అలసట లేదా నీరసం: ఉదయం నిద్ర లేవగానే కూడా తీవ్రమైన అలసట లేదా నీరసంగా అనిపించడం ఫ్యాటీ లివర్‌కు ఒక సంకేతం కావచ్చు.


* కుడి ఎగువ పొత్తికడుపులో అసౌకర్యం లేదా తేలికపాటి నొప్పి: కాలేయం ఉదరం యొక్క కుడి ఎగువ భాగంలో ఉంటుంది. ఫ్యాటీ లివర్ వల్ల కాలేయం పెద్దదిగా మారినప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అసౌకర్యం లేదా తేలికపాటి నొప్పిని ఉదయం పూట వస్తుంది.


* ఆకలి లేకపోవడం: ఉదయం పూట ఆకలి అనిపించకపోవడం లేదా ఆహారం తినడానికి కోరిక లేకపోవడం.


* వికారం లేదా వాంతులు: ఉదయం పూట వికారం లేదా వాంతులు సంభవించవచ్చు.


* బరువు తగ్గడం: ఆకలి తగ్గడం వల్ల వివరించలేని బరువు తగ్గడం.


* చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం


పైన చెప్పిన లక్షణాలు ఫ్యాటీ లివర్ లేదా అధిక కొలెస్ట్రాల్‌ను సూచించవచ్చు. కానీ ఇవి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా సంకేతం కావచ్చు. మీకు ఈ లక్షణాలలో ఏవైనా కనిపించినట్లయితే, స్వీయ-నిర్ధారణ చేసుకోకుండా.. వెంటనే వైద్యుణ్ని సంప్రదించండి. డాక్టర్ చెప్పిన విధంగా తగిన పరీక్షలు చేయించుకోవడం, సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యాధైనా సరే ప్రారంభ దశలో గుర్తించడం వల్ల దానిని నిరోధించవచ్చని నిపుణులు అంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa