సినిమా అయినా రాజకీయమైనా ఒకటే ఫార్ములా.. ఒకటి మనం సొంతంగా అయిన ఒక ట్రెండ్ సెట్ చేయాలి.. లేదా ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను ఫాలో కావాలి. 2019 ఎన్నికలతో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం.. పలువురు సీనియర్ నేతలు పార్టీ మారటం, మరికొందరు రాజకీయ సన్యాసం తీసుకోవటం.. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వంటి ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైసీపీ కండువా మార్చేశారు. ఈ పరిణామాలతో డీలాపడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపేలా.. వైఎస్ జగన్ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు.
2025 జూన్ 4వ తేదీతో ఏపీలో ఎన్డీయే కూటమి పాలనకు ఏడాది పూర్తి కాగా.. వెన్నుపోటు దినం అంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. విద్యార్థుల కోసం, సూపర్ సిక్స్ హామీల అమలు కోసం.. క్షేత్రస్థాయిలో పోరాటం ఉద్ధృతం చేస్తోంది. కూటమి పాలనకు హనీమూన్ పీరియడ్ ముగియటంతో ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగట్టాలని వైసీపీ నిర్ణయించింది. అలాగే జిల్లాల పర్యటనలు కానప్పటికీ.. ఇబ్బందులు పడుతున్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ పలు జిల్లాలలో పర్యటిస్తు్న్నారు. కార్యకర్తలను పరామర్శించడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఏడాది పూర్తి కావటంతో ఇప్పుడు మరింత దూకుడుగా వెళ్లాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా 2029 ఎన్నికలే లక్ష్యంగా అప్పుడే కసరత్తు ప్రారంభించారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో దీనిపై పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. అలాగే అనవసరంగా విదేశీ పర్యటనలు వద్దని.. స్థానికులకు, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలంటున్నారు. ప్రతి రోజూ నలుగురు ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ మాట్లాడతానని.. పద్ధతి మార్చుకుంటే పర్లేదని.. లేకుంటే వేటే అంటూ సీరియస్‌గానే చంద్రబాబు వార్నింగ్ ఇస్తున్నారు. 2029 ఎన్నికలకోసం చంద్రబాబు దూకుడుతో జగన్ కూడా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్ర..
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ యువ విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాదయాత్రపై వైఎస్ జగన్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా జిల్లాల పర్యటనలు చేస్తానని.. చివర్లో పాదయాత్ర ఉంటుందంటూ తన పొలిటికల్ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో బయటపెట్టారు వైఎస్ జగన్. గతంలో వర్కవుట్ అయిన పాత ఫార్ములానే మరోసారి ఉపయోగించాలనేది వైఎస్ జగన్ ఆలోచనగా తెలుస్తోంది. దీనికి తోడు తెలుగు రాజకీయాల్లో సక్సెస్ ఫార్ములా అయిన పాదయాత్రను ఫాలో కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
2017 నవంబర్ నెలలో ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్ప యాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. 341 రోజులు, 3,648 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగింది. 13 జిల్లాలు, 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2,516 గ్రామాలను కవర్ చేస్తూ ప్రజాసంకల్ప యాత్రను వైఎస్ జగన్ పూర్తి చేశారు. యాత్రలో తనకు ఎదురైన అనుభవాలు, ప్రజల వినతులతో నవరత్నాలు పథకాలను ప్రతిపాదించారు. ఇదే మ్యానిఫెస్టోలో చేర్చి 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. ఇప్పుడు కూడా మరోసారి అదే ఫార్ములాను వైఎస్ జగన్ ఫాలో కానున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa