ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్ బెదిరింపులకు భయపడనని స్పష్టం చేసిన జోహ్రాన్ మమ్దానీ

international |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 09:47 AM

అమెరికా రాజకీయాల్లో కీలక నగరమైన న్యూయార్క్‌లో మేయర్ ఎన్నికల పోరు తీవ్ర రూపం దాల్చింది. భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ పార్టీ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. జోహ్రాన్‌ను అరెస్ట్ చేయిస్తానని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తానని ట్రంప్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. దీంతో ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేద‌ని జోహ్రాన్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.మంగళవారం న్యూయార్క్ నగర మేయర్ పదవికి జోహ్రాన్ మమ్దానీ అధికారికంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో వలస విధానంపై ట్రంప్ మాట్లాడుతూ జోహ్రాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "జోహ్రాన్ ఒక కమ్యూనిస్ట్. మానసికస్థితి సరిగా లేని వ్యక్తి. మేయర్‌గా ఎన్నికైతే ఆయనతో చాలా సరదాగా ఉంటుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అంతటితో ఆగకుండా "వలసల నియంత్రణ సంస్థ (ICE) విధులకు ఆటంకం కలిగిస్తే, మేం అతడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. దేశానికి ఒక కమ్యూనిస్ట్ అవసరం లేదు. ఆయన పౌరసత్వం కూడా చట్టబద్ధమైనది కాదని చాలామంది అంటున్నారు. మేం అన్ని విషయాలనూ పరిశీలిస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు.ట్రంప్ బెదిరింపులపై జోహ్రాన్ మమ్దానీ అదే స్థాయిలో స్పందించారు. "అమెరికా అధ్యక్షుడు నన్ను అరెస్ట్ చేస్తానని, నా పౌరసత్వం తీసివేసి, నిర్బంధ శిబిరానికి పంపిస్తానని బెదిరించారు. నేనేదో చట్టాన్ని ఉల్లంఘించినందుకు కాదు, మా నగరంలో వలస సంస్థ (ICE) భయోత్పాతం సృష్టించడాన్ని నేను అడ్డుకుంటాననే ఈ బెదిరింపులు" అని తెలిపారు."ఈ వ్యాఖ్యలు కేవలం మన ప్రజాస్వామ్యంపై దాడి మాత్రమే కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి న్యూయార్క్ వాసికి ఒక సందేశం పంపే ప్రయత్నం. మీరు గొంతు విప్పితే, మీ కోసం కూడా వస్తారు అని చెప్పడమే వారి ఉద్దేశం" అని జోహ్రాన్ విమర్శించారు. ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్‌ను ట్రంప్ పొగడటాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికే మేయర్ ఆడమ్స్, ట్రంప్ ప్రభుత్వానికి వలస దాడులకు అనుమతిస్తున్నారని జోహ్రాన్ ఆరోపించారు.దక్షిణాసియా తల్లిదండ్రులకు ఉగాండాలో జన్మించిన జోహ్రాన్ మమ్దానీ, 1998లో తన ఏడవ ఏట అమెరికాకు వచ్చారు. ఆయనకు 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. ఇదే అంశాన్ని లేవనెత్తుతూ పలువురు రిపబ్లికన్లు ఆయన పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.33 ఏళ్ల జోహ్రాన్ సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకుంటూ, సామాన్య, శ్రామిక వర్గాల ప్రజల సమస్యలపై దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సర్వేల ప్రకారం ఆయన ప్రస్తుత మేయర్ ఎరిక్ ఆడమ్స్, రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివా కంటే ఆధిక్యంలో ఉన్నారు. నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో గెలిస్తే, న్యూయార్క్ నగరానికి తొలి ముస్లిం మేయర్‌గా జోహ్రాన్ చరిత్ర సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa