ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకు ఖాతా తెరవడానికి ఆధార్ తప్పనిసరి కాదు బాంబే హైకోర్టు కీలక తీర్పు వెల్లడి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 04:50 PM

బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలని ఖాతాదారులను బలవంతం చేయకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు ఇవ్వలేదన్న కారణంతో ఓ కంపెనీకి ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు రూ.50,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ వినియోగం అనేది పౌరుల స్వచ్ఛంద నిర్ణయమని, దాన్ని తప్పనిసరి చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు తేల్చిచెప్పింది.ఓ సంస్థ బ్యాంకు ఖాతా తెరిచేందుకు దరఖాస్తు చేసుకోగా, బ్యాంకు అధికారులు ఆధార్ వివరాల కోసం పట్టుబట్టారు. ఆ సంస్థ ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు పత్రాలు  అందించినప్పటికీ, బ్యాంకు అంగీకరించలేదు. దీనివల్ల ఖాతా తెరుచుకోవడం ఆలస్యమై, తమ కార్యకలాపాలకు అంతరాయం కలిగి ఆర్థికంగా నష్టపోయామని సదరు కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, బ్యాంకు చర్యలను చట్టవిరుద్ధమని పేర్కొంది. జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీల కోసం మాత్రమే ఆధార్‌ను ఉపయోగించాలని, ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయరాదని ఆ తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తుచేసింది.ఇతర కేవైసీ పత్రాలు అందుబాటులో ఉన్నప్పుడు ఆధార్ కోసం పట్టుబట్టడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని కోర్టు అభిప్రాయపడింది. ఖాతా తెరవడంలో ఆలస్యం చేసి కంపెనీకి నష్టం కలిగించినందుకు గాను, ఆ బ్యాంకు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పు, కేవైసీ నిబంధనలను రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa