ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో టీమిండియా తన ఆధిక్యాన్ని 400 పరుగులు దాటించి పటిష్ట స్థితిలో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించడంతో భారత్ విజయం దిశగా దూసుకెళ్తోంది.రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మరోసారి సత్తా చాటారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (58 బ్యాటింగ్), రిషభ్ పంత్ (65), కేఎల్ రాహుల్ (55) అర్ధశతకాలతో జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ముఖ్యంగా, పంత్ 58 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు సాధించాడు. పంత్ వన్డే తరహాలో ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ క్రమంలో నాలుగో రోజు రెండో సెషన్ కొనసాగుతున్న సమయానికి భారత్ 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దీంతో మొత్తం ఆధిక్యం 417 పరుగులకు చేరింది.అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269) అద్భుతమైన డబుల్ సెంచరీతో జట్టుకు వెన్నెముకగా నిలవగా, రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్, భారత బౌలర్ల ధాటికి 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ (158), వికెట్ కీపర్ జామీ స్మిత్ (184 నాటౌట్) శతకాలతో పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, ఆకాశ్ దీప్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు రాణిస్తుండటంతో ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఖాయంగా కనిపిస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa