ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రియల్ టైమ్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 07, 2025, 08:12 PM

టెక్నాలజీని వినియోగించుకుని జీరో క్రైమ్ రేట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. సాంకేతికత వినియోగించుకుని శాంతి భద్రతల పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ను ఓ మోడల్ రాష్ట్రంగా మార్చాలని స్పష్టం చేశారు. సోమవారం నాడు ఏపీ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్సుపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాలతో క్రైమ్ హాట్ స్పాట్లపై నిరంతరం నిఘా పెట్టి నేరాల నియంత్రణ చేయాలన్నారు. దీంతో పాటు ప్రైవేటు సీసీ కెమెరాల ఫుటేజి వ్యవహారంలోనూ నిబంధనలు మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నేరాల నియంత్రణకు ప్రైవేటు కెమెరాలను కూడా వినియోగించుకునేలా చూడాలని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడే వారి విషయంలో టెక్నాలజీని మరింతగా ఉపయోగించుకోవాలన్నారు. కొందరు తెలివిగా నేరాలు చేసి.. దాన్ని ప్రభుత్వంపై నెడుతున్నారని పోలీసులకు సహకరించని వ్యక్తులు, నేతల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఇలాంటి వారి కోసం పబ్లిక్ సేఫ్టీ యాక్టు కింద వారి వద్ద నుంచి డేటాను తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా నేరాలకు బాధ్యులుగా చేసే అంశంపైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా భద్రత కోసం నేరాల కట్టడి కోసం దర్యాప్తు నిమిత్తం షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్ల వద్ద ఉండే సీసీ కెమెరాల్లోని ఫుటేజీని సేకరించే వంటి వాటి విషయాల్లోనూ పబ్లిక్ సేఫ్టీ యాక్టును వర్తింప చేయాలన్నారు. మరోవైపు వివిధ రంగాల్లో డ్రోన్లు, సీసీ కెమెరాల వినియోగం పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఓర్వకల్లులో డ్రోన్ సిటీ పురోగతిపైనా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన రికార్డులు, డేటా భద్రతకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను కూడా పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి నూతన సాంకేతికతనే వినియోగించి భద్రంగా ఉండేలా చూడాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమాచారం డేటా లేక్ ద్వారా సమన్వయం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు 517 పౌరసేవల్ని వాట్సప్ గవర్నెన్సు ద్వారా అందిస్తున్నట్టు అధికారులు వివరించారు. అయితే అందిస్తున్న సేవలన్నీ యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పిడుగులు పడే ప్రాంతాల్లో విలువైన ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేయాలని.. ముందస్తు హెచ్చరికల వ్యవస్థ సమర్ధంగా పనిచేసేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ముందుగానే ఆయా ప్రాంతాల్లో సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. భూగర్భ జలాల పర్యవేక్షణకు ఫీజియో మీటర్లు, సెన్సార్లు త్వరితగతిన పునరుద్ధరించాలని అన్నారు. రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీరెంత, ఎంతమేర ప్రవాహాలు వస్తున్నాయి. సముద్రంలోకి విడుదల చేస్తున్న నీరెంత లాంటి వివరాలు నమోదు చేయాలన్నారు. రిజర్వాయర్లలో వచ్చే ప్రవాహాలకు సంబంధించిన వివరాలను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తే వరద నిర్వహణ చేయొచ్చన్నారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లనూ పూర్తి సామర్ధ్యంతో నింపుతున్నట్టు సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సముద్ర తీరప్రాంతాల్లో అలల ఉధృతి, చేపల వేటకు అవకాశం ఉన్న ప్రాంతాలపై ఇన్ కాయిస్ సంస్థ ఇచ్చే వివరాలను మత్స్యకారులకు, తీరప్రాంతాల్లోని వారికి అందేలా చూడాలని స్పష్టం చేశారు.ప్రతీ ప్రభుత్వ శాఖ తమ దగ్గర ఉన్న లబ్దిదారుల డేటా సహా ఇతర వివరాలను ఆర్టీజీఎస్ తో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వ్యత్యాసం ఉంటే తక్షణం ఆర్టీజీఎస్ కు తెలిపి డేటాను సవరించుకోవాలని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అందుకు తగినట్టుగా సంక్షేమ పథకాల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి అన్నారు.పేదరిక నిర్మూలన కోసం చివరి వ్యక్తి వరకూ చేయూత అందించటమే కూటమి ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. పీ4లో భాగంగా బంగారు కుటుంబం- మార్గదర్శి అనుసంధాన ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa