ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీజీఎస్ పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 14, 2025, 10:04 PM

 ఆర్టీజీఎస్ పనితీరుపై సోమవారం నాడు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, డేటా అనుసంధానం వంటి అంశాలపై చర్చించారు. అనుమానితులను గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థ పని తీరు మీద అధికారులు డెమో ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేరగాళ్ల భరతం పట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం మంచిదే. అయితే నేరం జరిగిన తర్వాత వారిని ట్రేస్ చేసి.. ఆ తర్వాత వారికి శిక్షలు పడేలా చేయడంతో పాటు. అసలు నేరాలు జరగకుండానే చూడాలి. ముందుగానే అనుమానితులను గుర్తించాలి. వారి కదలికలను ట్రేస్ చేయాలి. వారు ఏ తరహా నేరాలకు పాల్పడ్డారనే అంశాన్ని కూడా డేటా బేస్ లో పెట్టుకోవాలి. వారి కదలికలను గుర్తించి అలెర్ట్ అయితే చాలా వరకు నేరాలను కట్టడి చేయవచ్చు. రౌడీ షీటర్లు, క్రిమినల్స్ కు వారి వారి నేరాలను బట్టి డేటాలో కలర్ కోడింగ్ ఇవ్వాలి. అలాగే కొన్ని ప్రమాదాలను ముందుగా గుర్తించగలిగితే వాటిని ముందుగానే నివారించవచ్చు. ఈ మేరకు ఆర్టీజీఎస్ పని తీరు మెరుగుపడాలి” అని చంద్రబాబు చెప్పారు.“రాష్ట్రంలోని అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలి. ట్రాఫిక్ మేనేజ్మెంట్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్ రద్దీ వంటిది జరగ్గకుండా చూసుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి వెంటనే చలానాలు విధించకుండా.. సిగ్నల్ జంప్ చేస్తున్న వాహనాల ఫొటోలను ముందుగా వారికి పంపాలి. అలా రెండు మూడుసార్లు చూసి.. వారిలో మార్పు రాకుంటే అప్పుడు చలానాలు విధించాలి. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా సైబర్ నేరాలకు బలి అవుతున్నారు. దర్యాప్తు సంస్థల అధికారులం అంటూ ఫేక్ కాల్స్ వస్తే భయపడిపోతున్నారు. అప్పులు చేసి మరీ కోట్లాది రూపాయలు ఇచ్చేస్తున్నారు. అలాగే ఓటీపీల ద్వారా జరిగే సైబర్ మోసాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.” అని సీఎం వివరించారు.“వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే అందుబాటులో ఉన్న సేవలతో పాటు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. అన్ని రకాల సర్టిఫికెట్లు ఆన్ లైన్ లో తీసుకోవడమే కాకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటిని డౌన్ లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించబోతున్నాం. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. అయితే ఇక్కడితో ఆగిపోకూడదు. టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయడం ఎంత ముఖ్యమో.. వారికి అర్థమయ్యేలా చెప్పడం కూడా అంతే ముఖ్యం. వాటిని ఎలా ఉపయోగించాలో విడమరిచి చెప్పాలి. అవసరమైతే.. వాట్సాప్ గవర్నెన్స్ సేవలతో పాటు.. టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం అందించే ఇతర సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాన్ని వివరిస్తూ చిన్న చిన్న వీడియోలు చేయాలి. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు వినియోగించుకుంటున్న వారికి ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా ఎదురైతే.. వాటి వివరాలు.. వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యల పైనా.. నిరంతరం పని చేస్తూనే ఉండాలి. వాట్సాప్ గవర్నెన్స్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా అన్ని శాఖలకు చెందిన రికార్డులను డిజిటలైజ్ చేయాలి. ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా కాకుండా.. డిజిటలైజేషన్.. డేటా సేకరణ, డేటా అప్డేషన్ వంటి వాటి విషయాల్లో అన్ని శాఖలకు ఒకే రకమైన విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఆర్టీజీఎస్ డేటానే అన్ని శాఖలకు ప్రామాణికంగా ఉండాలి. టెక్నాలజీ పరంగా జరుగుతున్న మార్పులను.. అమలు చేయాల్సిన అంశాలను ఆయా శాఖల్లో వివరించేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించే విధంగా ఆలోచన చేయాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు. “ఓర్వకల్లులో డ్రోన్ సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. డ్రోన్ సిటీకి ప్రముఖ కంపెనీలు.. బహుళ జాతి సంస్థలు వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకోండి. డ్రోన్ సిటీలో ప్రభుత్వం ఇచ్చే వసతులను.. డ్రోన్ సిటీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించండి. డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా డిఫెన్స్ కంపెనీలను ఒప్పించగలిగితే.. ఎక్కువ పెట్టుబుడులు వస్తాయి. అధికారులు ఆ దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది” అని సీఎం వివరించారు. ఈ సమావేశంలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa