బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యంగా ఆమె కుమార్తె, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ సైమా వాజెద్ పుతుల్‌ను నిరవధిక సెలవుపై పంపింది. జులై 11వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చాయి. అయితే బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ ఆమెపై మోసం, ఫోర్జరీ, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణలతో కేసులు నమోదు చేసిన నాలుగు నెలల తర్వాత ఈ చర్య తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.
సైమా వాజెద్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ గతంలో కేసులు నమోదు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమెను సెలవుపై పంపినట్లు.. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్-జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మీడియాకు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెల్లడించేందుకు మాత్రం నిరాకరించారు. మరోవైపు సైమా వాజెద్ స్థానంలో డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్-జనరల్ కేథరీనా బోహ్మే తాత్కాలికంగా ఆ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆమె జులై 15వ తేదీన న్యూ ఢిల్లీలోని SEARO కార్యాలయానికి చేరుకుంటారు. ఆతర్వాతే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
అంతర్జాతీయంగా కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు.. వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి నొక్కిచెబుతోంది. ముఖ్యంగా డబ్ల్యూహెచ్ఓ వంటి సంస్థల విశ్వసనీయతకు ఇది అత్యంత కీలకం కాగా.. ఈ పరిణామం బంగ్లాదేశ్ రాజకీయ, అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు ఈ చర్యను జవాబుదారీతనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన మొదటి అడుగుగా పరిగణిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ పదవికి, ఐక్యరాజ్యసమితి వ్యవస్థకు విశ్వసనీయతను పునరుద్ధరించడానికి ఆమెను శాశ్వతంగా తొలగించడం, ఆమెకున్న ప్రత్యేక హక్కులను రద్దు చేయడం వంటి శాశ్వత పరిష్కారం అవసరమని కూడా వెల్లడిస్తున్నారు.
2024లో జులై, ఆగస్టు నెలల మధ్య బంగ్లాదేశ్‌లో విద్యార్థులు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో వివాదాస్పద కోటా విధానానికి వ్యతిరేకంగా నినదించారు. ఒక్కసారిగా ప్రధాని అధికారిక నివాసంపై దాడికి వచ్చారు. దీంతో షేక్ హసీనా తన 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికి భారత్ వచ్చేశారు. ప్రస్తుతం ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతుండగా.. ఆమెను అప్పగించమంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఇండియాను కోరుతున్నారు. ఇటీవలే ఆమె ఆడియో లీక్ కాగా మరోసారి మానవతా దృష్టితో ఆలోచించి ఆమెను అప్పగించాలని అభ్యర్థించారు. ఇలాంటి సమయంలోనే షేక్ హసీనా కుమార్తెపై ఆరోపణలు రావడంతో.. ఆమె గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa