ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఢిల్లీ వచ్చి సమావేశంలో పాల్గొన్న టీడీపీ బృందం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 15, 2025, 06:18 PM

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల విధానాల్లో సంస్కరణలు, ఓటరు జాబితా సవరణలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తరఫున పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు యాదవ్, టీడీపీ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస రావు మాట్లాడుతూ, ఓటరు జాబితాల్లోని లోపాలను సరిచేయాలన్న ఎన్నికల సంఘం లక్ష్యాన్ని స్వాగతించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఓటరు గుర్తింపులో ఆధార్‌ను ఏకైక ఆధారంగా పరిగణించకూడదని సూచించిన టీడీపీ, 11 రకాల గుర్తింపు పత్రాలను అంగీకరించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించింది.డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  సహాయంతో ఆధునిక సాంకేతికతను వినియోగించాలని పల్లా శ్రీనివాస రావు సూచించారు. ప్రతి ఓటరుకు ప్రత్యేక డోర్ నంబర్ కేటాయించడం ద్వారా డేటా చోరీని నిరోధించి, యూనిక్ ఓటర్ ఐడెంటిటీని సృష్టించవచ్చని ఆయన పేర్కొన్నారు.ఓటరు జాబితా పరిశీలనలో ఎన్నికల సంఘానికి ప్రత్యేక హక్కులు ఉన్నప్పటికీ, పౌరసత్వ నిర్ధారణ వారి అధికార పరిధిలో లేదని, 1995 సుప్రీంకోర్టు లాల్ బాబు హుస్సేన్ కేసు తీర్పును ఆయన గుర్తు చేశారు. అభ్యంతరాలు లేవనెత్తిన వారే ఆధారాలు సమర్పించాలని, ఆధారాలు చూపలేకపోయినంత మాత్రాన ఓటర్ల హక్కును రద్దు చేయడం సరికాదని స్పష్టం చేశారు.బీహార్‌లో ఓటర్ల తొలగింపు ప్రక్రియ కారణంగా గందరగోళం నెలకొందని, గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఆధార్ ఉన్నా ఇతర పత్రాలు లేని వారు ఎక్కువగా ఉండటం వల్ల నిజమైన ఓటర్లు తొలగింపుకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీహార్‌లో సుమారు 3 కోట్ల మంది ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం ఆర్టికల్ 326కు విరుద్ధమని, గుర్తింపు పత్రాలు లేని వారు భారతీయులేనని నిర్ధారించే బాధ్యత ప్రభుత్వ సంస్థలదేనని ఆయన అన్నారు.టీడీపీ తరఫున పల్లా శ్రీనివాస రావు, ఓటర్లకు అన్యాయం జరగకుండా న్యాయపరమైన, పారదర్శకమైన విధానాలను అమలు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలి.ఫీల్డ్ లెవెల్ అధికారుల నియామకంలో పారదర్శకతను నిర్వహించాలి.వాలంటీర్ వ్యవస్థలు, మొబైల్ వాహనాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పత్రాల సేకరణకు ప్రభుత్వం సహాయం అందించాలి.వాట్సాప్ హెల్ప్‌లైన్లు, వార్డు స్థాయి సమస్యా పరిష్కార విధానాలు సమర్థవంతంగా పనిచేయాలి.పార్టీ బూత్ స్థాయి ప్రతినిధులను అన్ని దశల్లో భాగస్వామ్యం చేయాలి.ప్రతి పౌరుని ఓటు హక్కును కాపాడేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలి.బూత్ లెవెల్ అధికారులకు ప్రస్తుతం అందిస్తున్న రూ.250 ప్రోత్సాహకాన్ని పెంచాలి. బూత్ లెవెల్ ఏజెంట్లు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేస్తే పని మరింత వేగంగా, సమర్థవంతంగా జరుగుతుంది.ఈ సమావేశంలో తెలుగుదేశం తరపున పల్లా శ్రీనివాస రావుతోపాటు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, శబరి, కూన రవికుమార్, జ్యోత్స్న పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa