రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తన ప్రభుత్వంలో అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక మంత్రి యూలియా స్విరిడెంకోను కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. గత ఐదేళ్లలో ఉక్రెయిన్‌కు కొత్త ప్రధాని రావడం ఇదే మొదటి సారి కాగా.. గతంలో అమెరికాతో ఖనిజ ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఆమె మధ్యవర్తిగా వ్యవహరించారు. అలాగే మరెన్న దేశాలతో ఆమెకు దౌత్యంలో కూడా అనుభవం ఉంది. అయితే యుద్ధ కాలంలో దేశ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడం, స్వదేశీ ఆయుధ ఉత్పత్తిని పెంచడం వంటి లక్ష్యాలతో జెలెన్‌స్కీ ఈ కీలక మార్పులు చేశారు.
39 ఏళ్ల వయసు కల్గిన యూలియా స్విరిడెంకో.. 2021 నుంచి రక్షణ మంత్రిగా ఉన్నారు. సమర్థవంతంగానే తన పనులు చేసుకుంటూ వస్తున్నారు. అయితే అమెరికాతో కీలకమైన ఖనిజాల ఒప్పందాన్ని చర్చించి, కుదుర్చుకోవడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. ఆమె నియామకం ద్వారా దేశీయ ఆయుధ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం, విదేశీ రుణాలపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం వంటి క్లిష్టమైన బాధ్యతలను జెలెన్‌స్కీ ఆమెకు అప్పగించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ప్రస్తుత ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్‌ను రక్షణ మంత్రిగా.. రక్షణ మంత్రి అయిన యూలియా స్విరిడెంకోను ప్రధాన మంత్రిగా నియమించారు. అలాగే ష్మిహాల్ ఉక్రెయిన్ చరిత్రలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రధాన మంత్రిగా గుర్తింపు పొందారు.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా దళాలు 1,000 కిలో మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఫ్రంట్‌లైన్ వెంబడి తమ దాడులను కొనసాగిస్తుండగా.. ఉక్రెయిన్ నగరాలపై వైమానిక దాడులు తీవ్రతరం అవుతున్నాయి. విదేశీ సహాయం తగ్గుతున్న నేపథ్యంలో దేశం సుమారు 19 బిలియన్ల డాలర్ల బడ్జెట్ లోటును ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్విరిడెంకో తన ప్రభుత్వం "నిజమైన పొదుపు" సాధించడానికి ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులపై పూర్తి ఆడిట్‌ను ప్రారంభిస్తుందని.. పెద్ద ఎత్తున ప్రైవేటీకరణలను వేగవంతం చేస్తుందని, వ్యాపారవేత్తలకు సహాయం చేస్తుందని తెలిపారు.
యూలియా స్విరిడెంకో నియామకానికి పార్లమెంటులో 262 ఓట్లు లభించాయి. ఇది స్పష్టమైన మెజారిటీని సూచిస్తుంది. అయితే కొందరు ప్రతిపక్ష చట్టసభ సభ్యులు కొత్త ప్రభుత్వం జెలెన్‌స్కీ పరిపాలన నుంచి ఎంతవరకు స్వతంత్రంగా పనిచేయగలదో అనే దానిపై సందేహాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ మార్పులు ఉక్రెయిన్ భవిష్యత్తుకు కీలకమైనవిగా భావిస్తున్నారు. యుద్ధాన్ని ఎదుర్కోవడానికి, దేశాన్ని పునర్నిర్మించడానికి అవసరమైన శక్తిని అందిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa