అగ్రరాజ్యం అమెరికాలో ఆంక్షలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఇదంతా మనందరికీ తెలిసిందే. అయితే అమెరికాలో దాడులు, దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే చట్టపరమైన శిక్షలతో పాటు విదేశీయులకు.. మళ్లీ అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా తాజాగా ఓ భారతీయ మహిళ అక్కడి ఓ దుకాణంలో దొంగతనం చేస్తూ పట్టుబడగా.. భారత్‌లోని అమెరకా రాయబార కార్యాలయం ఈ తాజా హెచ్చరికలు జారీ చేసింది.
అమెరికాలోని ఇల్లినాయిస్‌లోని ఒక స్టోర్‌లో.. సుమారు 1,300 డాలర్ల (రూ. 1.1 లక్షలు) విలువైన వస్తువులను దొంగిలించడానికి ఓ భారతీయ పర్యాటకురాలు ప్రయత్నంచారు. పదే పదే సరుకులు తీసుకువస్తూ.. కారులో పెట్టి అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించిన పోలీసులు.. ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసు బాడీక్యామ్ వీడియో వైరల్ కావడంతో.. ఆమె వస్తువులకు డబ్బులు చెల్లిస్తానని వేడుకున్నప్పటికీ అధికారి ఆమె నేరం చేశారని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై భారత దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం.. ఎక్స్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది. "అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడటం వలన చట్టపరమైన సమస్యలు మాత్రమే కాకుండా.. వీసా రద్దు కావడానికి, భవిష్యత్తులో యూఎస్ వీసాలకు అనర్హులు కావడానికి దారి తీయవచ్చు" అని హెచ్చరించింది. అమెరికా చట్టాన్ని గౌరవిస్తుందని అలాగే విదేశీ సందర్శకులు అన్ని చట్టాలను పాటించాలని ఆశిస్తుందని రాయబార కార్యాలయం నొక్కి చెప్పింది.
ఈ విషయంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ఏ దేశంలో నివసించినా అక్కడి చట్టాలను పాటించడం పౌరుల బాధ్యత అని అన్నారు. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రజలు ఆ దేశ చట్టాలను గౌరవించి, పాటించాలని.. తద్వారా తమకు, దేశానికి మంచి ప్రతిబింబాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ఈ సంఘటన విదేశాలకు వెళ్లే భారతీయ పౌరులందరికీ స్థానిక చట్టాలపై అవగాహన, వాటిని కచ్చితంగా పాటించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తుందన్నారు. ఈ హెచ్చరిక ట్రంప్ పరిపాలన కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలకు అనుగుణంగా ఉంది. దీనిలో జనవరి నుంచి 1.42 లక్షల మందికి పైగా వ్యక్తులను అమెరికా నుండి బహిష్కరించారు. ముఖ్యంగా వీసా దరఖాస్తుదారులకు సోషల్ మీడియా స్క్రీనింగ్, బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లను కూడా అమెరికా మరింత కఠినతరం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa