ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్

Life style |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 09:53 PM

అతిగా ఆలోచించే వారి కోసం జపనీస్ కొన్ని టెక్నిక్స్ చెప్పారు. వీటిని సరైన విధంగా అర్థం చేసుకుంటే ఓవర్ థింకింగ్ నుంచి సులువుగా బయట పడవచ్చు.


అతి ఆలోచనలు


సమస్యలు లేని వారెవరుంటారు. అందరికీ వస్తాయి. కానీ కొందరే వాటిని సరైన విధంగా డీల్ చేస్తారు. ఇంకొందరు డీలా పడిపోతారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందులో నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే ఆలోచించాలి. కానీ..ఆ ఆలోచన మరీ అతిగా ఉండకూడదు. చాలా మంది ఈ ఓవర్ థింకింగ్ వల్లే మానసికంగా కుంగిపోతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో పెట్టి చూస్తారు. దీని వల్ల ఉన్న సమస్యకు పరిష్కారం దొరకకపోగా కొత్తవి వస్తాయి. ఇలాంటప్పుడే ఏం చేయాలో జపనీస్ కొన్ని టెక్నిక్స్ చెప్పారు. వాటిని సరైన విధంగా పాటిస్తే అతి ఆలోచన నుంచి బయటపడవచ్చు. అన్నీ పాటించగలిగేవే. కాకపోతే వీటిని ఫాలో అవ్వాలి అన్న ఆలోచన ముందుగా మొదలు కావాలి. అక్కడితోనే మార్పు కూడా మొదలవుతుంది.


యాక్సెప్ట్ చేయడం


​ప్రతిసారీ టైమ్ మీకు అనకూలంగా ఉండదు. కొన్ని సార్లు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. ఆ సమయంలో ఇలా అయిపోయిందే అని దిగాలుగా కూర్చుంటే ఏ ఉపయోగం ఉండదు. మీ చేతుల్లో లేని వాటి గురించి అసలు ఆలోచించకూడదు. దీన్నే జపనీస్ Shoganai అంటారు. అంటే..తెలుగులో సరిగ్గా దీన్ని ట్రాన్స్ లేట్ చేస్తే "మీ చేతిలో ఏమీ లేదు" అనే అర్థం వస్తుంది. సిచ్యుయేషన్ ని యాక్సెప్ట్ చేయడమే ఈ టెక్నిక్. ఏం జరిగినా సరే అంగీకరించాలి. ఎందుకిలా జరిగింది అని ఆలోచించి, బాధ పడడం వల్ల ఎనర్జీ అంతా వృథా అయిపోతుంది. అదే ఎనర్జీని సమస్యను పరిష్కరించుకోవడంపైనే పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది అనేది ఈ టెక్నిక్ లో దాగున్న ఫిలాసఫీ.


ఫారెస్ట్ బాతింగ్


వినడానికి ఇది కాస్త వింతగానే అనిపిస్తుంది. ఫారెస్ట్ బాతింగ్ అంటే అడవిలో స్నానం చేయడం అని కాదు. పచ్చని ప్రకృతిలో గడపడం. దీన్నే షిన్ రిన్ యొకు టెక్నిక్ అంటారు జపనీస్. ఎప్పుడైతే నేచర్ లో గడుపుతారో అప్పుడు కార్టిసాల్ హార్మోన్స్ తగ్గిపోతాయి. ఇవి తగ్గాయంటే ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారు. ముఖ్యంగా ఓవర్ థింకింగ్ తో ఇబ్బంది పడే వారు అప్పుడప్పుడైనా ఇలా ప్రకృతిలో గడిపి రావడం చాలా మంచిది అని చెబుతున్నారు జపనీస్. ప్రశాంతమైన వాతావరణంలో గడిపితే మనసు రిలాక్స్ అయిపోతుంది. నెగటివ్ థాట్స్ దూరమవుతాయి. తద్వారా మానసిక ఆరోగ్యం కుదుటపడుతుంది. హాయిగా నిద్రపట్టేందుకు అవసరమైన హార్మోన్స్ విడుదలవుతాయి. దీన్నే ఫారెస్ట్ బాతింగ్ అంటారు. జపనీస్ చాలా ఎక్కువగా ఈ టెక్నిక్ ఫాలో అవుతారు.


మెడిటేషన్


మానసికంగా ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే టెన్షన్ తగ్గించి ప్రశాంతంగా మార్చేస్తుంది మెడిటేషన్. అందుకే రోజూ కనీసం ఓ పావుగంట పాటు రోజూ ధ్యానం చేయాలని యోగా ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తుంటారు. జపనీస్ కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతారు. దీని పేరు జాజెన్. అంటే ధ్యానంలో కూర్చోవడం అని అర్థం. మనసుని ప్రశాంతంగా మార్చడంలో ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దేనిపైనా ఎమోషనల్ అటాచ్ మెంట్ మరీ అతిగా లేకుండా, ఏం జరిగినా సరే యాక్సెప్ట్ చేసేయాలనే ఆలోచన పెరుగుతుంది. అన్నింటి కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే..అతిగా ఆలోచించే వారికి ఇది ఓ మంచి వ్యాయామం.


సవాళ్లు ఎదుర్కోవడం


సవాళ్లు ఎదుర్కోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడే చాలా మంది తడబడుతుంటారు. అందుకే అతిగా ఆలోచిస్తారు. ఎలాంటి కఠినమైన సవాలు వచ్చినా సరే గట్టిగా నిలబడి ఎదుర్కోవాలి. దీన్నే జపనీస్ గమన్ టెక్నిక్ అంటారు. జీవితం ఉన్నట్టుండి మీకు సడెన్ షాక్ లు ఇస్తూ ఉంటుంది. వెంటనే బెదిరిపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడే స్ట్రాంగ్ గా ఉండాలి. చాలా నెమ్మదిగా, కూల్ గా సిచ్యుయేషన్ హ్యాండిల్ చేయాలి. పరిష్కరించడం కుదరకపోతే అక్కడితే ఆలోచించడం వదిలేయాలి. ఆ టఫ్ టైమ్ వెళ్లిపోయేంత వరకూ ఓపిక పట్టక తప్పదు. ఉన్న చోట నుంచి ఓ అడుగు ముందుకు వేసినా చాలు. అదే ఆ తరవాత మీకు అలవాటైపోతుంది.


డైవర్ట్ అవడం


ఓ ఇబ్బంది వచ్చినప్పుడు ఎంత సేపూ అదే మూడ్ లో ఉంటే పరిష్కారం దొరకదు. బాధ పడడం తప్పు అనడం లేదు. కానీ అప్పుడప్పుడైనా కాస్త డైవర్ట్ అవాలి. లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యలు వస్తాయి. డైవర్ట్ అవ్వాలంటే నచ్చిన పని చేయాలి. ఒక్కోసారి కొత్త పనులు కూడా ట్రై చేయాలి. ఎప్పుడూ ఒంటరిగా సినిమాకి వెళ్లకపోతే ఈ సారి అది ట్రై చేయవచ్చు. లేదా కాసేపు అలా బయటకు వెళ్లి వాకింగ్ చేయాలి. అయితే జపనీస్ ఇకెబనా అనే ఓ టెక్నిక్ ఫాలో అవుతారు. అదేంటంటే..పూలను ఏదో ఓ ఆకారంలో అరేంజ్ చేయడం. అంటే.. బ్రెయిన్ కి ఎక్సర్ సైజ్ లా అన్నమాట. అలా మైండ్ ని డైవర్ట్ చేయడంతో పాటు పూలతో గడపడం వల్ల కాస్తంత రిలాక్సేషన్ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa