దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కావడం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది. ఆదివారం సాయంత్రం వేళ అమిత్ షా రాష్ట్రపతిని కలవగా, అంతకు ముందు మధ్యాహ్నం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ఆమెతో భేటీ అయ్యారు. ఒకే రోజు అది కూడా కొన్ని గంటల వ్యవధిలో జరిగిన ఈ రెండు కీలక సమావేశాలు దేశ రాజకీయాల్లో కొత్త ఊహాగానాలకు తావిచ్చాయి. సాధారణంగా ఎప్పుడో ఓసారి ఇలాంటి ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నడుస్తుండడం, ప్రతిపక్షాల ఆందోళనలతో సభల్లో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ భేటీలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
రాష్ట్రపతి కార్యాలయం ఈ సమావేశాల వివరాలను అధికారికంగా వెల్లడించినప్పటికీ.. వాటి వెనుక గల ఖచ్చితమైన కారణాలను మాత్రం తెలియజేయలేదు. దీనిపై రాజకీయ వర్గాలు, విశ్లేషకులు రకరకాల కోణాల్లో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా లోక్‌సభలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించే బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత ఈ భేటీలు జరగడం గమనార్హం. అంతేకాకుండా పార్లమెంటులో అనేక రాజకీయ అంశాలపై ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశ అత్యున్నత నాయకులు రాష్ట్రపతితో సమావేశం కావడం, కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సంప్రదింపులు జరిపి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు.
ఈ సమావేశాలు ప్రధాని మోదీ ఇటీవల విదేశీ పర్యటనలైన యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవులకు వెళ్లిన తర్వాత జరగడం కూడా ఒక ముఖ్యమైన అంశంగా నిలుస్తోంది. తన పర్యటనల వివరాలను రాష్ట్రపతికి వివరించి ఉంటారని భావిస్తున్నారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తన పదవికి రాజీనామా చేయడం కూడా ఈ భేటీకి మరో కారణమై ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియపై కూడా ఈ సమావేశాల్లో చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది.
భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ కార్యకలాపాలు, ప్రభుత్వ నిర్ణయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వ అధినేతలు రాష్ట్రపతికి సమాచారం ఇవ్వడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే ప్రధాని, హోంమంత్రి రాష్ట్రపతిని కలిసి ప్రస్తుత పరిణామాలపై చర్చించి ఉంటారని తెలుస్తోంది. ఈ భేటీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి దశలో.. అందులోనూ దేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో జరగడం ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa