ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతికేళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక.. ఓటుకు రూ.10 వేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 10, 2025, 06:36 PM

వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని పులివెందుల గ్రామీణ, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలు అసెంబ్లీని తలపిస్తున్నాయి. అధికార టీడీపీ , వైఎస్ఆర్సీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హైటెన్షన్ నెలకుంది. ఆగస్టు 12న పోలింగ్ జరగనుండగా.. ఆదివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో తెరవెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన మూడు దశాబ్దాల్లో పులివెందుల జెడ్పీటీసీ సీటుకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 1995, 2006, 2013, 2021లో ఎన్నిక ఏకగ్రీవమైంది. చివరిగా 2001లో మాత్రమే ఎన్నిక జరగడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఎన్నికలతో ఏకగ్రీవాలకు తెరపడింది. ఈ స్థానం వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ కావడంతో ఆ పార్టీకి సవాల్‌గా మారింది.


పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రలోభాలకు తెరలేచింది. ఇరు పార్టీలూ బేరసారాలకు తెరతీసినట్టు తెలుస్తోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వడానికి సిద్దమైనట్లు సమాచారం. పులివెందుల, ఒంటిమిట్ట సిట్టింగ్ స్థానాలు గతంలో వైఎస్ఆర్సీసీపీవే. అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ ప్రచారాలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. భారీ ఎత్తున భద్రతను ఏర్పాటుచేసి.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంచారు.


ముఖ్యంగా పులివెందులలో పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. పులివెందుల మున్సిపాల్టీలో కలిసిన గ్రామాలు మినహా మిగతా ఐదు ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఉప-ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ కూటమి అభ్యర్థిగా లతా రెడ్డి.. వైఎస్ఆర్సీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి బరిలో ఉండగా.. 10,601 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక, ఒంటిమిట్టలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాల పరిధిలోని 24,606 మంది ఓటేయనున్నారు. ఈ ఉప-ఎన్నికలో పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి భద్రతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు వారికి రక్షణ కల్పిస్తున్నారు.


కాగా, అధికార పార్టీకి పోలీసులు, అధికారులు కొమ్ముకాస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలింగ్‌ బూత్‌లను మార్చేశారని, గ్రామాల్లో ఓటర్‌ స్లిప్పులను పంపిణీ చేయలేదని ఆరోపణలు చేస్తోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన నేతలు విజయవాడలో ఆందోళనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే, డీజీపీ కార్యాలయానికి కూడా వెళ్లి దీనిపై ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa