ఓ రెండు మృతదేహాలు.. ఒంగోలు పోలీసులకు మిస్టరీగా మారాయి. అందులో ఒకటి మహిళది కాగా.. మరొకటి యువకుడిది. రెండు వేర్వేరు ప్రాంతాలలో, వేర్వేరు సమయాల్లో కనిపించిన ఈ మృతదేహాల వెనక మిస్టరీని ఛేదించే ప్రయత్నంలో ఒంగోలు పోలీసులు తలమునకలై ఉన్నారు. జూలై 30వ తేదీ.. కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల సమీపంలో ఓ మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. సముద్రం నుంచి ఒడ్డుకు మహిళ మృతదేహం కొట్టుకురావటంతో స్థానికులు భయపడిపోయారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. అసలు ఈ మహిళ ఎవరు.. ప్రమాదవశాత్తూ సముద్రంలో పడిపోయారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
అలాగే మహిళ కనిపించడం లేదంటూ ఆ చుట్టుపక్కల ఎలాంటి మిస్సింగ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఎవరా మహిళా.. ఎలా చనిపోయిందనే దానిని కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు. మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే మహిళ శరీరంలో నుంచి కొన్ని భాగాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు తలమునకలై ఉన్న సమయంలోనే..
ఒంగోలు నగర పరిధిలోని అగ్రహారం జగనన్న కాలనీ.. స్థానిక కాలనీవాసులకు ఓ నీటి కుంటలో యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ ఘటన జరగడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందే తన కొడుకు కనిపించడం లేదంటూ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో బేల్దారిగా పనిచేసే తన కొడుకు కనిపించడం లేదని కొత్తపట్నం పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు హైదరాబాద్‌లో బేల్దారిగా పనిచేస్తుంటాడని.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి కోసం జూలై 29న ఇక్కడికి వచ్చాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళ ఫిర్యాదుపై దర్యాప్తు జరిపిన కొత్తపట్నం పోలీసులు .. యువతి కోసం వచ్చిన యువకుడిపై దాడి జరిగినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను అదృశ్యమైనట్లు నిర్ధారించుకున్నారు. నీటికుంటలో దొరికిన యువకుడి మృతదేహం అతనిదేనని భావించి కుటుంబీకులకు సమాచారం కూడా అందించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ముందు మృతదేహం నుంచి కొన్ని భాగాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షల కోసం పంపించారు. కానీ ఇంతలోనే కథలో ట్విస్ట్..
యువకుడి విషయంలో అనుమానం కలగటంతో.. కొత్తపట్నం పోలీసులు కరీంనగర్‌లో ఉంటున్న అతని భార్యను కలిసేందుకు వెళ్లారు. అయితే ఈ విషయం తెలిసిన యువకుడి భార్య.. తానుంటున్న గది ఖాళీచేసి వెళ్లిపోయారు. దీంతో పోలీసులకు ఈ కేసు మరిన్ని తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో చనిపోయాడని అనుకుంటున్న యువకుడి నుంచి పోలీసులకు వీడియో కాల్ వచ్చినట్లు సమాచారం.
తన భార్య కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న యువకుడు.. వీడియోకాల్ ద్వారా పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ యువకుడు, అతని భార్య ఫోన్లు స్విఛాప్ చేసుకున్నారు. దీంతో సముద్రంలో కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం ఎవరది.. నీటికుంటలో దొరికిన యువకుడి డెడ్ బాడీ ఎవరిదనేదీ పోలీసులకు అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఈ జంట మృతదేహాల కేసులను ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa