ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ జెండా ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 09:18 PM

దాదాపు 200 ఏళ్ల బ్రిటిషర్ల వలస పాలనకు చరమ గీతం పాడుతూ.. 1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రజాస్వామ్య, సార్వభౌమాధికార దేశంగా భారత్ తన ప్రయాణాన్ని సగర్వంగా కొనసాగిస్తోంది. దీంతో ఏటా ఆగస్టు 15వ తేదీన భారతీయులంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా త్రివర్ణ పతకాన్ని ఎగరేయడంతోపాటు.. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. స్వాతంత్య్ర సమర యోధుల పోరాటాలను స్మరించుకుంటాం. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాకుండా ఇళ్లు, వాణిజ్య స్థలాల్లోనూ త్రివర్ణ పతకాన్ని ఎగరేసి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం.


అయితే త్రివర్ణ పతకాన్ని ఎగరేసే సమయంలో కొన్ని నిబంధనలు పాటించడం తప్పనిసరి. జెండా ఎగరేసే క్రమంలో ఫ్లాగ్ కోడ్‌లో సూచించిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. సూర్యోదయం తర్వాత జాతీయ పతాకాన్ని ఎగరేసి.. సూర్యాస్తమయం వేళ కిందకు దించాలి. 2022లో ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకు సవరణలు చేశారు. దీని ప్రకారం రాత్రుళ్లు కూడా వెలుతురు ఉన్నట్లయితే జాతీయ జెండా ఎగరొచ్చు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను జెండా కర్ర కింది నుంచి పైకి తాడు సాయంతో లాగి ఎగరేస్తారు. 1947 వలస పాలనకు ముగింపు పలికినందుకు గుర్తుగా ఇలా చేస్తారు.


చేయాల్సిన పనులు:


⇛ జాతీయ పతాకాన్ని వేగంగా ఎగరేసి.. మెల్లగా, గౌరవప్రదంగా కిందకు దింపాలి.


⇛ జాతీయ పతాకాన్ని నిలువుగా ఎగరేసినప్పుడు.. కాషాయ రంగు పట్టీ కచ్చితంగా పై భాగంలో ఉండాలి.


⇛ జాతీయ పతాకాన్ని ఎల్లప్పుడూ ప్రముఖమైన స్థానంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇతర జెండాలు లేదా వస్తువులేవీ జాతీయ పతాకాన్ని కప్పి ఉంచేలా ఉండొద్దు.


⇛ జాతీయ పతకాన్ని అడ్డంగా ప్రదర్శించినప్పుడు.. కాషాయ రంగు పట్టీ పై భాగంలో ఉండాలి. నిలువుగా ప్రదర్శించినప్పుడు ప్రేక్షకులకు ఎదురుగా కనిపించేలా కాషాయ పట్టీ ఎడమ వైపున ఉండాలి.


⇛ జాతీయ పతాకం ఎల్లప్పుడూ శుభ్రంగా, దెబ్బతినకుండా, చినిగిపోకుండా, రంగు చెదిరిపోకుండా ఉండాలి.


⇛ ఫ్లాగ్ కోడ్ నిబంధనలకు అనుగుణంగా చేతితో, మెషీన్‌తో తయారు చేసిన కాటన్, పాలిస్టర్, వూల్ లేదా సిల్క్ ఖాదీ బంటింగ్‌తో జాతీయ జెండాను తయారు చేయాలి.


⇛ జాతీయ జెండాను ఆదివారాలు, సెలవు దినాలు సహా అన్ని రోజుల్లోనూ ఎగరేయొచ్చు. సామాన్యులతోపాటు ప్రయివేట్ సంస్థలు, విద్యా సంస్థలు.. ఇలా ఎవరైనా సరే సవరించిన 2022 ఫ్లాగ్ కోడ్ నిబంధనలను పాటిస్తూ జాతీయ జెండా ఎగరేయొచ్చు.


⇛ జాతీయ పతాకాన్ని రాత్రుళ్లు కూడా ఎగరేయొచ్చు. అయితే త్రివర్ణ పతకం బాగా వెలుతురులో ఉండి, స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి.


⇛ త్రివర్ణ పతాకం ఏ సైజ్‌లోనైనా ఉండొచ్చు. కానీ దాని పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో ఉండేలా చూడాలి.


⇛ కార్యక్రమాల సమయంలో జాతీయ పతాకాన్ని విగ్రహంపై లేదా స్మారక చిహ్నంపై కప్పడానికి ఉపయోగించొచ్చు. అయితే జెండా ఎట్టి పరిస్థితుల్లోనూ నేలను లేదా ఫ్లోర్‌ను తాగొద్దు.


⇛ దెబ్బతిన్న లేదా మురికిగా మారిన జెండాను గోప్యంగా డిస్పోజ్ చేయాలి. జాతీయ జెండా గౌరవానికి భంగం కలగని రీతిలో గోప్యంగా దహనం చేయడం కానీ పారేయడం కానీ చేయాలి.


చేయకూడని పనులు:


⇛ జాతీయ పతాకాన్ని దాని గౌరవాన్ని దెబ్బతీసేలా ఉపయోగించకూడదు. ఉదాహరణ: ఏ వ్యక్తికి లేదా వస్తువుకు వందనం తెలిపే ఉద్దేశంతో జాతీయ పతాకాన్ని వంచి ప్రదర్శించకూడదు.


⇛ త్రివర్ణ పతాకాన్ని తలకిందులుగా (కాషాయ రంగు పట్టీ కింది భాగంలో ఉండేలా) ఎగరేయొద్దు.


⇛ జాతీయ పతాకం నేలను, ఫ్లోర్‌ను, నీటిని తాక కూడదు


⇛ జాతీయ పతాకాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దు. ఉదా: దుస్తులు, దిండు కవర్లు, నాప్‌ కిన్లు లేదా ఇతర వస్తువులపై త్రివర్ణ పతాకాన్ని వాడొద్దు. జాతీయ వేడుకల సందర్భంలో పేపర్ ఫ్లాగ్స్ లాంటి అనుమతి ఉన్న సందర్భాలకు ఇది వర్తించదు.


⇛ స్టేట్ లేదా సైనిక అంత్యక్రియల్లో మినహా.. త్రివర్ణ పతాకాన్ని భవనం, వాహనం లేదా ప్లాట్‌ఫామ్‌పై కప్పుగా ఉపయోగించొద్దు.


⇛ త్రివర్ణ పతాకాన్ని ఇతర జెండాల కంటే కిందగా లేదా దాని ప్రాధాన్యాన్ని తగ్గించే విధంగా పక్కన ఎగరేయకూడదు.


⇛ జాతీయ పతాకంపై ఎలాంటి రాతలు, ముద్రణలు లేదా ఇతర మార్పులు ఉండొద్దు.


⇛ జాతీయ పతాకం లేదా దాని డిజైన్‌ను.. నడుం కంటే దిగువ భాగాన్ని కప్పే దుస్తులు, యూనిఫామ్‌లు లేదా ఆభరణాల తయారీకి వాడొద్దు. అయితే ఫ్లాగ్ పిన్స్ లేదా గుర్తులను గౌరవప్రదంగా ధరించొచ్చు.


⇛ త్రివర్ణ పతాకాన్ని ఉద్దేశపూర్వకంగా చింపేయడం, కాల్చడం లేదా పాడు చేయడం లాంటి పనులు పబ్లిక్‌లో చేయొద్దు. 1971 నాటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు ది నేషనల్ హానర్ యాక్ట్ ప్రకారం ఇది నేరం.


అదనపు మార్గదర్శకాలు:


2022 ఫ్లాగ్ కోడ్ సవరణల తర్వాత పౌరులు తమ ఇళ్లు, కార్యాలయాలు లేదా ఫ్యాక్టరీల్లోనూ జాతీయ పతాకాన్ని ఎగరేయాలి. అయితే పైన పేర్కొన్న అన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఫ్లాగ్ కోడ్‌ను ఉల్లంఘించడం లేదా జాతీయ పతాకాన్ని అవమానించడం చేస్తే.. 1971 నాటి చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa