ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంద్రాగస్టు వేడుకల వేళ.. ఎట్ హోం కార్యక్రమానికి దూరంగానే సీఎం స్టాలిన్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 15, 2025, 09:23 PM

భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ.. తమిళనాడులో రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్.. గవర్నర్ ఆర్.ఎన్. రవి రాజ్ భవన్‌లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమాన్ని బహిష్కరించారు. గవర్నర్ చర్యలు "తమిళనాడుకు వ్యతిరేకంగా" ఉన్నాయని ఆరోపిస్తూ.. ఆయన ఇచ్చే తేనీటి విందుకు హాజరు కాకూడదని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు. ఈ బహిష్కరణ రాష్ట్ర ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య కొనసాగుతున్న తీవ్రమైన రాజకీయ సంఘర్షణకు పరాకాష్టగా నిలిచింది.


తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న వివాదం కొత్తదేమీ కాదు. గవర్నర్ రవి, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన అనేక బిల్లులకు ఆమోదం తెలపకుండా జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ వివాదం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లింది. ఇటీవలే 'కలైంజ్ఞర్ యూనివర్సిటీ' ఏర్పాటు కోసం అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతికి పంపడంపై అధికార డీఎంకే పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది గవర్నర్ ఉద్దేశపూర్వక జాప్యమని.. రాష్ట్ర శాసనసభ అధికారాలను అణగదొక్కే ప్రయత్నమని డీఎంకే నాయకులు విమర్శించారు.


ముఖ్యంగా గవర్నర్ రవి.. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రిని విస్తృతంగా ప్రశంసించారు. అయితే తమిళనాడు ప్రభుత్వం గురించి ఒక్క మంచి మాట కూడా చెప్పలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన సవాళ్లు, సామాజిక వివక్ష, ఆత్మహత్యల రేటు, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలు, పిల్లలపై లైంగిక నేరాల వంటి విషయాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో డీఎంకే నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గవర్నర్ వ్యాఖ్యలపై తమిళనాడు స్థానిక పాలన మంత్రి కె.ఎన్. నెహ్రూ తీవ్రంగా ప్రతిస్పందించారు.


గవర్నర్ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిలా కాకుండా.. రాజకీయ ప్రత్యర్థిలా వ్యవహరిస్తున్నారని, ఆయన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని మంత్రి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, వివిధ రంగాలలో తమిళనాడు సాధించిన అగ్రస్థానం గురించి అధికారిక గణాంకాలను ఆయన కావాలనే విస్మరించారని తెలిపారు. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విధమైన ప్రతికూల వ్యాఖ్యలు చేయడం గవర్నర్ పదవికి తగదని అన్నారు. ఈక్రమంలోనే సర్కారు నిరసనను వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈరోజు రాజ్‌ భవన్‌‌లో గవర్నర్ ఇవ్వబోయే తేనీటి విందుకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు.


ఇది మాత్రమే కాకుండా గవర్నర్‌పై తమకు ఉన్న వ్యతిరేకతను అనేక మంది నిర్మొహమాటంగా చూపించేస్తున్నారు. ఇటీవలే ఉన్నత విద్యా శాఖ మంత్రి కె. పొన్ముడి విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. రెండ్రోజుల క్రితమే ఒక పీహెచ్‌డీ విద్యార్థిని కూడా గవర్నర్ చేతుల మీదుగా డిగ్రీ తీసుకోవడానికి నిరాకరించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. తమిళనాడు రాజకీయాల్లో గవర్నర్, ప్రభుత్వం మధ్య ఉన్న లోతైన రాజకీయ వైరాన్ని బట్టబయలు అయంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa