కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ.. కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై ఓట్ల చోరీకి పాల్పడుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఈసీ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా తాను చేసిన ఓట్ చోరీ వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను చూపాలని.. లేదంటే బేషరుతగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది.
తాము ఇచ్చిన వారం రోజుల గడువులోగా రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో కూడిన అఫిడవిట్ సమర్పించకపోతే.. ఆయన చేసిన ఆరోపణలన్ని అవాస్తవమేనని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఏడు రోజుల్లోగా ఆయన అఫిడవిట్ అయినా సమర్పించాలి.. లేదంటే క్షమాణలు అయినా చెప్పాలి తప్ప.. మరో మార్గం లేదని ఈసీ స్పష్టం చేసింది.
బీహార్ ఓటర్ల జాబితా సవరణ.. ఆపై దీనిపై రాహుల్ గాంధీ చేసిన ఓట్ చేరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నాడు అనగా ఆగస్టు 17న ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. దీనిపై వివరణ ఇచ్చింది. ఈ క్రమంలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పౌరులు, పార్టీల మధ్య ఎన్నికల సంఘం ఎలాంటి వివక్ష చూపించదని.. ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ.. కొందరు కావాలనే ఈసీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఈసీ భుజం మీద తుపాకీ పెట్టి.. ఓటర్లతో రాజకీయం చేయాలనే కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అలానే తమని బెదిరించాలని చూస్తే భయపడమని.. తప్పుడు ఆరోపణలకు తాము అసలే బెదరమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే బీహార్‌లో ఓటర్ల జాబితా సవరించామని.. అక్కడ ఓట్ చోరీ జరిగిందనేది పచ్చి అబద్ధమని.. తెలిపారు.
అయితే కొందరు కావాలనే.. రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తేల్చి చెప్పారు. ఆధారాలు లేకుండా ఎన్నికల సంఘాన్ని విమర్శిచండం సరి కాదన్నారు. అర్హలైన వారి ఓటు తొలగిస్తే.. వారు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఇచ్చామని తెలిపారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని.. అయినా సరే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందవచ్చని తెలిపారు. దీనిపై రాహుల్ గాంధీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa