ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీకి మద్దతుగా యూరప్‌లోని కీలక దేశాల అధినేతలు వాషింగ్టన్‌కు బయల్దేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఈ రోజు వైట్‌హౌస్‌లో జరగనున్న కీలక సమావేశంలో వారు జెలెన్‌స్కీతో పాటు పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరిపిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.గతంలో జెలెన్‌స్కీతో జరిగిన సమావేశంలో ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ చేదు అనుభవం పునరావృతం కాకుండా, ఈసారి ఉక్రెయిన్‌కు అండగా నిలబడి తమ ఐక్యతను చాటాలనే లక్ష్యంతో యూరప్ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెలెన్‌స్కీ అభ్యర్థన మేరకే తాను ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ తెలిపారు. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ వంటి ప్రముఖ నేతలు వాషింగ్టన్‌కు వెళ్తున్న వారిలో ఉన్నారు.రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు తమ పూర్తి మద్దతు ఉందని చాటి చెప్పడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నారు. "ఈ సమయంలో మనం రష్యా ముందు బలహీనంగా కనిపిస్తే, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు దారి తీసినట్లే అవుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఉక్రెయిన్‌కు భద్రతా హామీలు, భూభాగ సమగ్రత, రష్యాపై ఆంక్షల కొనసాగింపు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.ఇటీవల అలస్కాలో పుతిన్‌తో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌లోని డాన్‌బస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగిస్తే యుద్ధాన్ని ముగించవచ్చనే ఒక ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అయితే, తమ దేశ భూభాగాన్ని ఒక్క అంగుళం కూడా వదులుకునే ప్రసక్తే లేదని, అది తమ రాజ్యాంగానికి విరుద్ధమని జెలెన్‌స్కీ ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో యూరప్ నేతల మద్దతుతో ట్రంప్‌తో జెలెన్‌స్కీ జరపబోయే చర్చలు కీలకంగా మారాయి. శాంతి ఒప్పందం దిశగా కొంత పురోగతి ఉన్నప్పటికీ, ఇరు పక్షాల మధ్య ఇంకా కీలక విభేదాలు ఉన్నాయని, ఒప్పందం కుదరడానికి చాలా సమయం పట్టవచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు. దీంతో ఈ రోజు వైట్‌హౌస్‌లో జరిగే సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa