దేశంలోనే తొలి ఎనిమిది వరుసల అర్బన్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీకి మరింత అనుసంధానం చేయడం, ప్రయాణ దూరం, వాహనాల రద్దీ, ట్రాఫిక్లను నియంత్రించేలా ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే, అర్బన్ ఎక్స్ టెన్షన్ రహదారులు అందుబాటులోకి వచ్చాయి. సుమారు రూ.11వేల కోట్ల వ్యయంతో ఈ రెండు ప్రాజెక్టులను నిర్మించారు.
దేశంలో మొట్టమొదటి 8 లైన్ల అర్బన్ ఎలివేటెడ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రావడంతో ఢిల్లీ గురుగ్రామ్ మధ్య ప్రయాణ దూరం గంట నుంచి 20 నిమిషాలకు తగ్గనుంది. అంతేకాదు, ఎటువంటి ట్రాఫిక్ జామ్‌లు, రద్దీ లేకుండా ఇందిరా గాంధీ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. అంతేకాదు, నొయిడా నుంచి గురుగ్రామ్ మధ్య ప్రయాణించేవారికి కూడా ఉపశమనం లభిస్తుంది. గురుగ్రామ్ నుంచి ఫరీదాబాద్ మనేసర్, సొనిపట్, పానిపట్, చంఢీగఢ్లకు ప్రయాణ సమయం 50 శాతం మేర తగ్గనుండటం విశేషం.
29 కిలోమీటర్ల పొడవున్న ఇది ప్రస్తుతం దేశంలోనే అతి చిన్న ఎక్స్‌ప్రెస్‌వే. దీని వెడల్పు దాదాపు 34 మీటర్లు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో 18.9 కి.మీ హర్యానాలో, మిగిలిన 10.1 కి.మీ ఢిల్లీలో ఉంది. ఇది మహిపాల్‌పూర్‌లోని శివుడి విగ్రహం నుంచి ప్రారంభమై గురుగ్రామ్‌లోని ఖేర్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉక్కు, 20 లక్షల క్యూబిక్ మీటర్ల సిమెంట్‌ను ఉపయోగించారు. ఇందుకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేశారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను సింగిల్ పిల్లర్‌పై 23 కి.మీ. ఎలివేటెడ్.. 4 కి.మీ. అండర్‌గ్రౌండ్‌లో నిర్మించారు. అంటే, వాహనాలు ఫ్లైఓవర్ పై, సొరంగం లోపల నడుస్తాయి. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలో నాలుగు అంతస్తులుగా మారే స్థలం కూడా ఉంది. ఈ స్థలం కింద ఒక అండర్‌పాస్.. దాని పైన ఒక సర్వీస్ లేన్.. దాని పైన ఒక ఫ్లైఓవర్ ఉండగా.. దాని పైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే వెళుతుంది. ఈ ప్రదేశానికి మల్టీ యుటిలిటీ కారిడార్ అని పేరు పెట్టారు. ఇది గురుగ్రామ్‌లోని సెక్టార్ 82 సమీపంలో ఉంది.
దేశంలోనే అత్యంత విశాలమైన 3.6 కి.మీ సొరంగాన్ని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేపై నిర్మించారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రెండు వైపులా మూడు లేన్ల సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటుచేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే NH-8లోని శివమూర్తి నుంచి ప్రారంభమై ద్వారకా సెక్టార్ 21, గురుగ్రామ్ సరిహద్దు, బసాయి గుండా వెళ్లి ఖిడ్కి దౌలా టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa