కుక్కకాటుకు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు చేయించుకోవాలని చాలా మంది చెబుతుంటారు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం 16 సూదులను తీసుకునే వాళ్లు కుక్క కరిచిన వాళ్లు. ఇంత పెద్ద మొత్తంలో ఇంజెక్షన్లు ఇప్పించుకునేది కుక్కకాటుకు గురైన వాళ్లే కాగా.. తాజాగా ఓ బాలుడికి పాము కరవగా.. వైద్యులు ఏకంగా 76 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇంత పెద్ద మొత్తంలో సూది మందులు వేసి మరీ అతడిని కాపాడారు. ఇప్పటి వరకు ఇంత ఎక్కువ మొత్తంలో ఇంజెక్షన్లు ఎవరికీ చేసుండకపోవడంతో.. అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలతడికి ఇన్ని ఇంజెక్షన్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లా ఉదయ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ 15 ఏళ్ల కరన్ అనే బాలుడు.. తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోనే కట్టెలు సేకరించడానికి వెళ్లాడు. అయితే అదే సమయంలో అనుకోకుండా అతడిని నాగుపాము కాటు వేసింది. వెంటనే విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వారు వెంటనే బాలుడికి పాము కరిచిన చోట కట్టు కట్టారు. విషం ఒళ్లంతా పాకకుండా ఉండాలని అలా చేశారు. అంతేకాకుండా పామును వెతికి మరీ చంపేశారు. దాన్ని ఓ కవర్లో వేసుకుని మోటార్ సైకిల్‌పై బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
పామును గుర్తు పట్టడం ద్వారా సరైన యాంటీ-వెనమ్ ఇవ్వడం సులభమవుతుందని ఉద్దేశంతోనే చంపిన పామును వారు వెంట తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి వెళ్లేలోపే బాలుడి పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. అతడికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. శరీరమంతా విషం వేగంగా వ్యాపిస్తున్న సంకేతాలు కనిపించాయి. సమయానికి స్పందించిన జిల్లా ఆసుపత్రిలోని అత్యవసర వైద్య అధికారి డాక్టర్ హరి మాధవ్ యాదవ్.. వెంటనే బాలుడికి చికిత్స ప్రారంభించారు. మొదట రెండు యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లు ఇచ్చారు. కానీ బాలుడి ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల కనిపించకపోవడంతో డాక్టర్ మరిన్ని ఇంజెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
రెండు గంటల వ్యవధిలో ప్రతి ఒకటిన్నర నిమిషాలకు ఒక ఇంజెక్షన్ చొప్పున మొత్తం 76 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఈ చికిత్స మొత్తం ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తూ కొనసాగింది. ఒక్క పాము కాటుకు ఇంత భారీ స్థాయిలో యాంటీ-వెనమ్ ఇవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకు ఆసుపత్రిలో తగినంత యాంటీ-వెనమ్ సరఫరా అందుబాటులో ఉండటం ఒక వరం లాంటిదని వైద్యులు తెలిపారు. డాక్టర్ల సకాలంలో చేసిన ఈ ప్రయత్నమే బాలుడి ప్రాణాలను నిలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కరన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే అతను అందరితోనూ మాట్లాడ గలుగుతున్నప్పటికీ.. ఇంకా అలసటగానే ఉన్నాడని వివరించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతడు త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa