తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో ఉండే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు తమ పదవిని కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు లోక్‌సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ సంచలన నిబంధనలతో కూడిన బిల్లులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సభలో ప్రవేశపెట్టగా, విపక్షాలు వ్యతిరేకించాయి.కనీసం ఐదేళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి, అరెస్టయి, నెల రోజులు కస్టడీలో ఉంటే 31వ రోజున వారి పదవి పోయేలా నిబంధనను చేర్చారు. వారు రాజీనామా చేయకపోయినా కొత్త నిబంధన ప్రకారం పదవిని కోల్పోతారు. దీనిని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, జమ్ము కశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లులను అమిత్ షా సభ ముందు ఉంచారు. ఈ బిల్లులు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని ప్రజా ప్రతినిధులకు వర్తించేలా కొత్త చట్టపరమైన నిబంధనలను ప్రతిపాదిస్తున్నాయి.ఈ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని ఆయన అన్నారు. "ఈ బిల్లుతో కార్యనిర్వాహక సంస్థలే న్యాయమూర్తిగా, జ్యూరీగా, శిక్ష అమలు చేసే వారిగా తయారవుతాయి... వాటికి అపరిమిత అధికారాలు లభిస్తాయి. ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు ఈ నిబంధనలను దుర్వినియోగం చేయవచ్చు" అని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు.కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ కూడా ఈ బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. "నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా నిర్దోషే అనేది మన చట్టబద్ధమైన పాలనలోని ప్రాథమిక సూత్రం. కానీ ఈ బిల్లు ఆ సూత్రాన్నే మార్చేలా ఉంది. ఇది ఒక కార్యనిర్వాహక అధికారిని ప్రధానమంత్రి కంటే ఉన్నత స్థానంలో నిలబెడుతుంది" అని ఆయన లోక్‌సభలో అన్నారు.విపక్ష సభ్యులు నినాదాలతో వెల్‌లోకి దూసుకెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ బిల్లులను హడావుడిగా తీసుకువచ్చారని ఆరోపించారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు.అమిత్ షా స్పందిస్తూ, బిల్లులను హడావుడిగా తీసుకురాలేదని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు తెలిపారు. తాను గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అరెస్టుకు ముందే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానని అమిత్ షా గుర్తు చేశారు. కోర్టు తనను నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని తెలిపారు. విపక్షాల నిరసనల నడుమ లోక్‌సభ స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa