అవసరం లేకపోయిన రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తూ.. లాండ్రీ దుకాణం నడుపుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవార్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, భారత్‌ను సుంకాల మహారాజ్ అంటూ విమర్శలు గుప్పించారు. ‘లాభాపేక్ష పథకం’ నడుపుతూ రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురును శుద్ధిచేసి అధిక లాభాలకు అమ్ముకుంటోందని ఆరోపించారు. వైట్‌హౌస్ వెలుపల నవార్రో మీడియాతో మాట్లాడుతూ.. దీనికి శిక్షగా భారత్‌పై ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమలవుతాయని ఉద్ఘాటించారు.
‘‘ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 2022లో దండయాత్ర మొదలయ్యే సమయానికి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయలేదు.. వారి అవసరాల్లో ఇది దాదాపు ఒక్క శాతం మాత్రమే.. కానీ, ఇప్పుడు అది 35 శాతానికి చేరుకుంది.. వారికి అవసరం లేకున్నా ఆయిల్ దిగుమతి చేసుకుని శుద్ధిచేసిన తర్వాత అమ్ముకుని లాభాలు గడిస్తోంది.. ఒక విధంగా చెప్పాలంటే మాస్కోకు భారత్ చాకిరేవు దుకాణం నడుపుతోంది..’’ అని ట్రంప్ సలహాదారు వ్యాఖ్యానించారు. అయితే, అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తేలేదని భారత్ స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోలును కొనసాగిస్తామని సంకేతాలు ఇవ్వడంతో అమెరికా మరింత రగిలిపోతోంది.
50 శాతం సుంకాలు విధించడంతో విసిగిపోయిన భారత్.. రష్యాతో తమ దీర్ఘకాల స్నేహాన్ని పునరుద్ఘాటించింది. ఇటీవలి రోజుల్లో ప్రాంతీయ ప్రత్యర్థి చైనాతో ఉద్రిక్తతలను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. అటు, మాస్కో పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. ప్రపంచ ఇంధన మార్కెట్ స్థిరీకరణ కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని గతంలో అమెరికానే సలహా ఇచ్చిందని, ఇప్పుడు తాము అదే పనిచేస్తుంటే ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ‘‘వాస్తవానికి గత కొన్నేళ్లుగా ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడానికి ప్రతిదీ చేయాలని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పిన దేశం అమెరికా’’ అని ఆయన అన్నారు.
ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి 2022లో రష్యా పూర్తిస్థాయి యుద్ధం మొదలైన తర్వాత నుంచి మాస్కో నుంచి భారత్ అధికంగా చమురు కొనుగోలు చేస్తోంది. రష్యాను ఆర్ధికంగా నిలువరించి, దండ్రయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా ముడి చమురుపై నిషేధం విధించడంతో రాయితీపై అమ్మకానికి రష్యా ముందుకొచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న భారత్.. పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేస్తోంది. అయితే, ఇది పరోక్షంగా రష్యా యుద్ధానికి నిధులు సమకూర్చడమేనని ట్రంప్ ఆరోపిస్తూ.. భారతీయ వస్తువులపై 50 శాతం సుంకాలు విధించారు.
తన ఇంధన అవసరాలను తీర్చుకోడానికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే భారత్ వాదన అర్దరహితమని నవారో అన్నారు. ‘నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు.. కానీ, దయచేసి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారత్ తన పాత్రను అర్థం చేసుకోవాలి.. మీరు చేస్తున్నం శాంతి కోసం కాదు.. యుద్ధాన్ని కొనసాగించడానికి మాత్రమే.. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయిస్తోంది. ఇది దోపిడీ తప్ప మరేమీ కాదు’ అని ఆరోపించారు.
‘‘భారత్ టారిఫ్‌ల మహారాజ్.. వారితో వాణిజ్యం కారణంగా అమెరికా కార్మికులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మాపై వేసిన సుంకాల డబ్బుతో రష్యా నుంచి చమురు కొనుగోలుచేసి ఉక్రెయిన్‌లో హత్యలకు సహకరిస్తోంది.. చివరికి అమెరికన్ పన్ను చెల్లింపుదారులు కీవ్‌కు సహాయ, సైనిక సామగ్రి పంపించాల్సిన పరిస్థితి నెలకుంది.. ఈ రక్తపాతంలో భారత్ తన పాత్రను గుర్తించడం లేదు’’ అని నవారో తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa