ఆసియా కప్ 2025 కోసం ఎంపికైన భారత జట్టులో స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు స్థానం దక్కకపోవడంపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాడు, అయ్యర్ వంటి నాయకత్వ లక్షణాలు కలిగిన ఆటగాడిని విస్మరించడం అసమంజసమని పేర్కొన్నాడు. అయ్యర్‌ను టీ20 జట్టులో చేర్చకపోవడం క్రికెట్ అభిమానులను కూడా నిరాశపరిచింది.
శ్రేయస్ అయ్యర్ ఇటీవలి కాలంలో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. యూఏఈలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతను రాణించాడు, ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేర్చి నాయకత్వ పాటవాన్ని చాటాడు. మిడిలార్డర్‌లో స్థిరమైన బ్యాటింగ్, ఒత్తిడిలోనూ నిలకడగా ఆడే సామర్థ్యంతో అయ్యర్ తనదైన ముద్ర వేశాడు. అయినప్పటికీ, సెలెక్టర్లు అతడిని టీ20 ఫార్మాట్‌కు అనగుండా పక్కనపెట్టడం చర్చనీయాంశమైంది.
ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో బ్రాడ్ హాడిన్ మాట్లాడుతూ, అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడం అర్థంకాని నిర్ణయమని విమర్శించాడు. "అయ్యర్ మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సమర్థుడు, అతని బ్యాటింగ్ శైలి, నాయకత్వ లక్షణాలు అసాధారణం. మిడిలార్డర్‌లో అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అతను కెప్టెన్‌గా ఉంటాడనుకున్నా, కానీ జట్టులోనే చోటు దక్కకపోవడం షాకింగ్," అని హాడిన్ అన్నాడు. అయ్యర్‌ను కావాలనే తప్పించారని, ఇది జట్టు స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో భారత టీ20 జట్టుకు ఆడాడు. దేశవాళీ క్రికెట్‌ను విస్మరించాడనే కారణంతో 2024-25 సీజన్‌లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించబడ్డాడు. అయితే, దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి, ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో మళ్లీ బీసీసీఐ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ, ఆసియా కప్ 2025 జట్టు ఎంపికలో అతడిని పరిగణనలోకి తీసుకోకపోవడం క్రికెట్ అభిమానులను, విశ్లేషకులను ఆలోచనలో పడేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa