అమెరికా సహా పశ్చిమ దేశాలతో ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు పెరుగుతున్న వేళ.. చైనా గడ్డపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు సహా 20 దేశాధినేతలను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానించారు. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతున్నందుకు గానూ.. భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వేళ.. చైనాలో షాంఘై కో ఆపరేషన్ సదస్సు నిర్వహించడం.. దానికి మోదీ, పుతిన్ లాంటి వాళ్లు వెళ్లడం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా.. గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని.. విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా సహా పశ్చిమ దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిగే ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు. భారత్‌పై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల గడువు ముగియనున్న నేపథ్యంలో.. ఈ ఎస్‌సీఓ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు.. 7 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం మరో విశేషం. 2020లో తూర్పు లఢఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఇప్పుడిప్పుడే భారత్, చైనా వివాదం ముగుస్తున్నట్లు వార్తలు రావడంతో.. ప్రధాని మోదీ చైనా పర్యటన.. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలను మరింత తగ్గించేందుకు ఒక కీలక ముందడుగా మారనుంది. ఈ పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ.. వాణిజ్యం, వీసా ఆంక్షలను సడలించడం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్‌పింగ్ చర్చించనున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఈ ఎస్‌సీఓ సదస్సుకు.. 20 మందికి పైగా ప్రపంచ నాయకులను జిన్‌పింగ్ ఆహ్వానించారు. వీరిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాల అధినేతలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యాకు.. ఈ సమావేశం దౌత్య వేదికగా మారింది. అదే సమయంలో ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంఘీభావాన్ని చాటాలని ఈ ఎస్‌సీఓ వేదికను చైనా ఉపయోగించుకుంటోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరోవైపు.. భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాల వేళ.. ప్రస్తుతం భారత్, చైనాల మధ్య మళ్లీ సత్సంబంధాలు చిగురిస్తున్నాయి. అమెరికా తీసుకువస్తున్న ఒత్తిడి నేపథ్యంలో భారత్, చైనా ఒక్కటవుతున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల గుజరాత్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. అమెరికా సుంకాలతో ఎంత ఒత్తిడి వచ్చినా.. భారతదేశ రైతులు, చిరు వ్యాపారులకు నష్టం కలిగించే విషయంలో ఎలాంటి రాజీపడబోమని తేల్చి చెప్పారు.
భద్రత, ఉగ్రవాద వ్యతిరేకతతో పాటు, ఆర్థిక, సైనిక సహకారాలను కూడా ఎస్‌సీఓ కూటమి దేశాలు క్రమంగా విస్తరించుకుంటున్నాయి. అయితే.. ఈ కూటమి కేవలం రాజకీయ ప్రయోజనాలకు ఒక వేదికగా మారుతోందని.. కావాల్సిన సహకారాన్ని మాత్రం సాధించలేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. భారత్, పాకిస్తాన్ మధ్య ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారత్, చైనా సంబంధాలు మెరుగుపడేందుకు ఈ ఎస్‌సీఓ సమావేశం ఒక అవకాశంగా మారనుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa