ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నంవాసులకు బంపరాఫర్.. డబుల్ డెక్కర్ బస్సుల టికెట్ ధర సగానికి తగ్గింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 30, 2025, 07:45 PM

విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి.. సాగర తీర నగరంలో పర్యాటకులను ఆకర్షించడానికి కొత్తగా రెండు డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం వీటిని బీచ్ రోడ్డులో ప్రారంభించారు. ఈ బస్సుల్లో ఒక టికెట్ తీసుకుంటే 24 గంటల పాటు ప్రయాణించవచ్చు.. అయితే టికెట్ ధర రూ.500 అని అధికారులు చెప్పగా.. దానిని సగానికి (రూ.250) తగ్గిస్తామని సీఎం అక్కడే ప్రకటించారు. మిగిలిన డబ్బును ప్రభుత్వమే భరిస్తుందని.. సబ్సిడీ కింద పరిగణించాలి అన్నారు. పర్యాటకులను ఆకర్షించడానికి టికెట్ ధరను తగ్గించడానికి ముఖ్య కారణం అన్నారు. అంతేకాదు తరచూ ప్రయాణించే వారి కోసం టికెట్ ధరలో మరింత తగ్గింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి డబుల్ డెక్కర్ బస్సులో పార్క్ హోటల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులో మహిళలతో మాట్లాడారు. విశాఖ నగరం మహిళలకు సురక్షితమైన నగరంగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. కొంతమంది స్థానికుల్ని పిలిచి తన పక్క సీట్లో కూర్చోమని చెప్పి మాట్లాడారు.


విశాఖపట్నానికి సముద్రతీరం ఉండటం కలిసొచ్చే అంశమన్నారు చంద్రబాబు. సాగర తీర నగరానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారన్నారు. నగరంలో 14 పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా రెండు డబుల్ డెక్కర్ బస్సుల్ని ప్రారంభించామన్నారు. 66మంది ప్రయాణికులు ఒక్కో బస్సులో ప్రయాణించొచ్చు. ఈ బస్సుల సంఖ్యనుపెంచుతామని.. డబుల్ డెక్కర్ బస్సుల్ని కూడా ఎలక్ర్టిక్‌ మోడ్‌లో తీసుకొచ్చామన్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సుకి ఒకసారి చార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చన్నారు.


విశాఖపట్నం ఆర్ధికంగా అభివృద్ధి చెందుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత పాలకులు విశాఖను రాజధాని చేయాలన్న ప్రతిపాదనను ప్రజలు తిరస్కరించారన్నారు. విశాఖపట్నం టెక్నాలజీ హబ్‌గా ఎదుగుతోందని.. త్వరలో ఆసియాలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నగరంలో డేటా సెంటర్, సీ కేబుల్ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖపట్నం ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలతో పోటీ పడుతోందన్నారు. విశాఖపట్నం ప్రజలు బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు చంద్రబాబు.. ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.


ఈ డబుల్ డెక్కర్ బస్సుల్ని విశాఖపట్నం ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు నడపాలని ప్లాన్ చేశారు. ఆర్కే బీచ్, కైలాసగిరి, రుషికొండ, తొట్లకొండ, భీమిలి బీచ్‌ల మధ్య నడపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విశాఖవాసులకు, పర్యాటకులకు థ్రిల్ ఇచ్చే లా.. ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో జాలీగా అలా ఓ రైడ్ వేయొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa