ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజస్థాన్ ఎమ్మెల్యేగానూ పింఛన్ కావాలంటూ ,,,మాజీ ఉపరాష్ట్రపతి దన్ఖడ్ పెన్షన్ వివాదం

national |  Suryaa Desk  | Published : Sun, Aug 31, 2025, 04:31 PM

కొద్ది రోజుల క్రితమే భారత ఉపరాష్ట్రపతి పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసి దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన జగదీప్ దన్ఖడ్.. ఇప్పుడు మరో కొత్త వివాదానికి తెర తీశారు. మాజీ రాజస్థాన్ ఎమ్మెల్యేగా తనకు నిలిచిపోయిన పెన్షన్‌ను తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ఆయన రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశారు. ఈ లేఖ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి, పలు పెన్షన్లకు అర్హత కలిగి ఉండి కూడా.. మరో పింఛన్ కోసం కోరడం ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


జగదీప్ దన్ఖడ్ 1993 నుంచి 1998 వరకు రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత ఆయనకు మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ లభించేది. అయితే 2019లో ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాజస్థాన్ నిబంధనల ప్రకారం ఆయన పెన్షన్ నిలిచిపోయింది. ఒక మాజీ ఎమ్మెల్యే ఏదైనా రాజ్యాంగబద్ధమైన లేదా ప్రభుత్వ పదవిని పొందినప్పుడు పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత కూడా ఈ నిలిపివేత కొనసాగింది.


 తాజాగా జులై 21వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి దన్ఖడ్ రాజీనామా చేశారు. ఈక్రమంలోనే మాజీ ఎమ్మెల్యేగా తనకు లభించాల్సిన పెన్షన్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతూ దన్ఖడ్ రాజస్థాన్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు కావడం వల్ల.. రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేల పెన్షన్ నిబంధనల ప్రకారం ఆయనకు నెలకు రూ.42,000 పెన్షన్ లభిస్తుంది. ప్రస్తుతం దన్ఖడ్ మాజీ ఉపరాష్ట్రపతిగా నెలకు దాదాపు రూ.2 లక్షలు, మాజీ ఎంపీగా నెలకు రూ.45,000 పెన్షన్ పొందనున్నారు. వీటన్నిటితో పాటు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కూడా కలిస్తే ఆయనకు నెలకు దాదాపు రూ.2.87 లక్షల వరకు లభిస్తుంది.


గతంలో ఉపరాష్ట్రపతిగా ఆయనకు నెలకు రూ.4 లక్షల వేతనంతో పాటు అనేక ఇతర భత్యాలు లభించాయి. ఇప్పటికే మూడు వేర్వేరు పెన్షన్లకు అర్హత కలిగి ఉన్న ఈయన తాజాగా మరో పెన్షన్ కోసం ఎందుకు దరఖాస్తు చేసుకున్నారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. రాజకీయ విశ్లేషకులు ఈ అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. కొందరు ఇది కేవలం చట్టబద్ధమైన హక్కును కోరుకోవడమేనని వాదిస్తుంటే.. మరికొందరు ఈ చర్య రాజకీయంగా సరైనది కాదని విమర్శిస్తున్నారు. దన్ఖడ్ తన రాజీనామాకు వ్యక్తిగత, ఆరోగ్య కారణాలను పేర్కొన్నప్పటికీ.. ఆయన హఠాత్తుగా పదవిని వీడటంపై రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు చెలరేగాయి.


కాంగ్రెస్ నాయకులు ఆయన నిర్ణయం వెనుక లోతైన రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ వివాదాల నడుమ ఇప్పుడు పెన్షన్ వ్యవహారం తెరపైకి రావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దన్ఖడ్ తన ఈ చర్యపై ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇది ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa