ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ .. చైనాలో అడుగుపెట్టారు. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతకుముందే చైనా అధ్యక్షుడితో సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలు విధిస్తున్న సమయంలో ఈ పర్యటన జరుగుతుండటంతో.. ఈ భేటీపై భారత్, చైనా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇదే సమయంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ఆసక్తికర పోస్టు చేసింది. మొగావో గుహలలో కనిపించిన గణేశుడి ప్రతిమల ఫోటోలను షేర్ చేసింది.
భారతదేశం, చైనా మధ్య ఎప్పటి నుంచో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చైనా రాయబార కార్యాలయం తెలిపింది. టాంగ్ రాజవంశం కాలంలో మొగావో గుహలలో ఈ వినాయక ప్రతిమలు కనిపించాయని పేర్కొంది. ‘శతాబ్దాల కాలం నుంచే ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయనే దానికి ఇదొక అందమైన ప్రతీక’ అని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ అన్నారు.
ప్రధాని మోదీ ‘చైనా పర్యటన’, భారత్‌లో గణేష్ నవరాత్రుల వేళ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాల వల్ల ఇండియా-యూఎస్ సంబంధాలు అంత బాగా లేవు. ట్రంప్ అంతకుముందే, చైనాపై టారిఫ్‌లు విధించారు. ఈ నేపథ్యంలో మోదీ, జీ జిన్‌పింగ్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధాని మోదీ భేటీ కానున్నారు. భారత్-చైనా-రష్యా ఒకే వేదికపైకి రావడం వైట్ హౌస్‌లో ప్రకంపనలు రేపుతోంది.
సెప్టెంబర్ 1న తియాంజిన్ వేదికగా ప్రారంభమయ్యే SCO సమావేశానికి ముందే చైనా అధ్యక్షుడితో ప్రధాని మోదీ రెండు దఫాలుగా సమావేశమవుతారని జాతీయ మీడియా కథనాల్లో రాశారు. SCO సదస్సులో మోదీ, పుతిన్‌తో పాటు 15 మంది ప్రపంచ నాయకులు పాల్గొననున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం తీసుకురావడానికి భారత్, చైనా కలిసి పనిచేయాల్సి ఉందని ప్రధాని మోదీ.. అంతకుముందే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పరస్పర గౌరవం, రెండు దేశాల ప్రయోజనాలు, ఇరు దేశాల ప్రజల మధ్య సున్నితత్వాల ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకువెళ్లడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఉంటే ప్రపంచానికి మంచి జరుగుతుందని ఆయన అన్నారు.
ఇవి (భారత్, చైనా) ఇరుగుపొరుగున ఉన్న అతిపెద్ద దేశాలు. వీటి మధ్య సంబంధాలు బాగుంటే దాని ప్రభావం ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్త శాంతి, సుసంపన్నతలపై సానుకూలంగా ఉంటుంది
ప్రధాని నరేంద్ర మోదీ
2020లో లఢఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత పలు అంతర్జాతీయ వేదికలపై ఇరు దేశాధినేతలు తారసపడ్డా ఎడమొహం, పెడమొహంగానే వ్యవహరించారు. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని.. చైనాకు వెళ్లడం ఇదే మొదటిసారి. అందుకే మోదీ 2 రోజుల చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50 శాతం పన్నులు విధించిన తర్వాత భారత్-చైనా సంబంధాలు మరింత ఆసక్తిగా మారాయి. ఇద్దరు నేతలు పాత విషయాల గురించి కాకుండా, కొత్త విషయాలపై ఏకాభిప్రాయానికి రావాలని ఇరు దేశాల్లో చాలా మంది ఎదురు చూస్తున్నారు.
మోదీ చైనా పర్యటనకు ముందే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని ఆర్థిక మంత్రుల స్థాయి సమావేశంలో నిర్ణయించారు. భారత పౌరులకు చైనా విజిటింగ్ వీసాలను పెంచింది. ముఖ్యంగా మానస సరోవర్ యాత్రికులను పెద్ద సంఖ్యలో అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. చైనా యాత్రికులకు భారత్ విరివిగా వీసాలు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తొలుత జపాన్‌లో 2 రోజులు పర్యటించారు. అక్కడ నుంచి నేరుగా చైనాకు వచ్చారు. 2 రోజుల పర్యటన నిమిత్తం చైనాలో అడుగుపెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. చైనా మహిళలు భారతీయ సంగీతం, నృత్యంతో మోదీకి స్వాగతం పలికారు. వీణ, తబలా, వయోలిన్ వాయిద్యాలపై వందేమాతరం గీతం వినిపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa