ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే సాలెపురుగులు మీ ఇంటిని ఖాళీ చేసి పారిపోతాయి

Life style |  Suryaa Desk  | Published : Wed, Sep 03, 2025, 10:48 PM

మనం ప్రతి రోజూ ఇంటిని శుభ్రం చేస్తాం. కానీ, చాలా సార్లు ఇంటి మూలల్ని అంతగా పట్టించుకోం. దీన్ని ఆసరగా చేసుకుని సాలెపురుగులు విజృంభిస్తాయి. ఇంటి మూలలు, పైకప్పుల్ని వదిలిపెట్టకుండా వాటి ఆవాసాల్ని ఏర్పరచుకుంటాయి. సాలెపురుగులు గూడులు ఇంటి అందాన్ని పాడు చేస్తాయి. వీటిని కంట్రోల్ చేయకపోతే.. ఇల్లు మొత్తం వ్యాపిస్తాయి. అంతేకాకుండా సాలీడు విషపూరితమైంది. దీని కాటు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని కాటు వల్ల చర్మ సంక్రమణకు కారణమవుతుంది. అందుకే సాలెపురుగులతో పాటు వాటి గూడుల్ని వదిలించుకోవాలి. చాలా మంది మార్కెట్లో దొరికే రసాయనాలు వాడతారు. వీటి వాసన అందరికీ పడకపోవచ్చు. అయితే, కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో వాటిని తరిమికొట్టొచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.


సాలెపురుగుల్ని వదిలించే నేచరల్ స్ప్రే


* సాలెపురుగుల్ని ఇంట్లో దొరికే పదార్థాలతో చేసే స్ప్రేతో వదిలించుకోవచ్చు. ఆ స్ప్రే తయారీ విధానం తెలుసుకుందాం.


* ముందుగా ఒక స్ప్రే బాటిల్‌లో నీటిని నింపండి. ఈ నీరు సాదాగా, శుభ్రంగా ఉండాలి.


* ఈ నీటిలో కనీసం 2 నిమ్మకాయల రసం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలని గుర్తించుకోండి.


* ఇప్పుడు ఈ స్ప్రేని ఇంటి గోడలు, మూలలపై పిచికారీ చేయండి. ఈ నీటిలో నిమ్మరసం కలపడం వల్ల పుల్లగా మారుతుంది. దీని వాసన సాలెపురుగులకు పడదు. పుల్లటి వాసనలు సాలెపురుగులకు పడవని నిపుణులు చెబుతున్నారు. అందుకే అవి ఇంటి వెళ్లిపోతాయి.


స్ప్రేని సరిగ్గా వాడే విధానం


* ఇంట్లో తయారుచేసిన స్ప్రేని సరిగ్గా ఉపయోగిస్తే, మీకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని వాడే పద్ధతి కూడా సులభం.


* ముందుగా, చీపురుతో అన్ని సాలెపురుగులను వాటి గూడుల్ని శుభ్రం చేయండి. నేరుగా స్ప్రేని పిచికారీ చేస్తే, సాలెపురుగులు గోడకు అంటుకుంటాయి. ఇది గోడను దెబ్బతీస్తుంది.


* నీట్‌గా క్లీన్ చేసిన తర్వాత ఇంట్లో తయారుచేసిన నిమ్మకాయ స్ప్రేను పిచికారీ చేయండి. ఇది సాలీడు గూడుల్ని క్లియర్ చేయడమే కాకుండా సాలెపురుగులను కూడా తరిమికొడుతుంది. * సాలెపురుగులు మాటిమాటీకి ఒకే ప్రదేశంలో పదే పదే స్థావరం ఏర్పరుస్తాయి.


* ఒకసారి పిచికారీ చేసిన తర్వాత.. కనీసం 7 రోజుల పాటు ఆ ప్రదేశంలో నిరంతరం స్ప్రే చేయండి. దీంతో సాలెపురుగులు అక్కడి నుంచి పారిపోతాయి. దీంతో పాటు మరికొన్ని చిట్కాలు కూడా బాగా పనికొస్తాయి. అవి ఏంటంటే


వెనిగర్


​వెనిగర్ రుచి కూడా పుల్లటి స్వభావంతో ఉంటుంది. ఈ వాసన కూడా సాలెపురుగులకు పడదు. అందుకే వెనిగర్ ఉపయోగించి సాలెపురుగుల్ని ఇంటి నుంచి దూరంగా ఉంచవచ్చు. ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో సమాన మొత్తంలో వెనిగర్, నీటిని కలిపండి. ఈ స్ప్రేను ఇంటి మూలలు, పగుళ్లు, సాలెపురుగుల గూడ్లు ఉన్న ప్రదేశాల్లో పిచికారీ చేయండి. వెనిగర్ వాసన, ఆమ్ల స్వభావం కారణంగా సాలెపురుగులు ఇంటి నుంచి దూరంగా ఉంటాయి.


పిప్పరమెంట్ ఆయిల్


సాలెపురుగులు పిప్పరమెంటు వాసనను ఇష్టపడవు. అందుకే వాటిని తరిమికొట్టడానికి పిప్పరమెంటు నూనెను ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒక కప్పు నీటిలో 10-15 చుక్కల పిప్పరమెంటు నూనెను కలిపి స్ప్రే బాటిల్‌లో నింపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇంటి మూలల్లో పిచికారీ చేయండి. దీంతో పాటు ఇంటి మూలల్లో ఎండిన పుదీనా ఆకులను కూడా ఉంచవచ్చు.


నిమ్మ, నారింజ తొక్కలు


సిట్రస్ వాసన కూడా సాలెపురుగులను దూరంగా ఉంచడంలో సాయపడుతుంది. ఇందుకోసం ఇంటి మూలల్లో నిమ్మ, నారింజ తొక్కలను ఉంచవచ్చు. లేదంటే ఈ తొక్కలను ఎండబెట్టి, పొడి చేసి నీటిలో కలిపి స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా, ఇంటిని శుభ్రపరిచేటప్పుడు మీరు సిట్రస్ రుచిగల క్లీనర్‌లను కూడా ఉపయోగించవచ్చు. కావాలనుకుంటే వాటి గూడులపై వేప నూనెను స్ప్రే చేయవచ్చు. ఇంటి మూలల్లో వేపాకుల్ని కూడా ఉంచవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa