కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా బొమ్మలాపుర గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక పులిని పట్టుకోవడంలో అటవీ శాఖ సిబ్బంది విఫలమయ్యారన్న ఆగ్రహంతో గ్రామస్థులు ఊహించని రీతిలో నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించడంలో అలసత్వం వహించిన అధికారులను ఏకంగా పులిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బోనులోనే బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
గత కొన్ని రోజులుగా బొమ్మలాపుర గ్రామ శివార్లలో ఒక పులి తరచుగా సంచరిస్తోంది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా, పశువులను మేపడానికి వెళ్లాలన్నా జంకుతున్నారు. పులి దాడి చేస్తుందేమోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ సమస్యను అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు పులిని పట్టుకోవడంలో జాప్యం చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పులిని పట్టుకోవడానికి బోనులు ఏర్పాటు చేసినప్పటికీ, అది వారం రోజులుగా కనిపించకపోవడంతో అధికారులు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యంపైనే గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల తీరుపై విసిగిపోయిన గ్రామస్థులు సోమవారం ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి వచ్చిన అటవీ శాఖ సిబ్బందిని చుట్టుముట్టి, వారిని నిలదీశారు. పులి బోనులో బంధించే వరకు తాము కదలబోమని తేల్చి చెప్పారు. వాదనలు తీవ్రం కావడంతో, ఆగ్రహించిన గ్రామస్థులు పులిని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన ఖాళీ బోనులోకి అటవీ సిబ్బందిని బలవంతంగా తోసి, బయటి నుంచి తాళం వేశారు. అధికారులను బోనులో బంధించి, అక్కడే ధర్నాకు దిగారు. పులిని పట్టుకుని తమకు రక్షణ కల్పించే వరకు బోను నుంచి విడుదల చేయబోమని స్పష్టం చేశారు. ఈ దృశ్యాన్ని చూసిన మిగిలిన గ్రామస్థులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆశ్చర్యపోయారు.
దాదాపు గంటసేపు బోనులో బంధీలుగా ఉన్న అటవీ శాఖ సిబ్బంది, గ్రామస్థులను శాంతింపజేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. పులిని తక్షణమే పట్టుకుని, గ్రామస్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడంతో గ్రామస్థులు వారిని విడుదల చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఈ ఘటన అద్దం పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa