రాష్ట్ర పరిపాలనలో నూతనోత్సాహం నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా కొత్త కలెక్టర్లకు నేడు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విజయానికి కలెక్టర్లే కీలకమని, వారు తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించిన నేపథ్యంలో, గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో అధికారులతో పనిచేశాను. కానీ ఈసారి కలెక్టర్ల ఎంపికకు గతంలో ఎన్నడూ లేనంతగా కసరత్తు చేశాను. ప్రజలు మనపై భారీ అంచనాలతో ఉన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే మీ పనితీరే ముఖ్యం. మీరే నా టీమ్. పనిచేస్తే ప్రోత్సాహం ఉంటుంది, ఫలితాలు రాకపోతే మాత్రం ఉపేక్షించేది లేదు" అని స్పష్టం చేశారు."సీఎం అంటే కామన్ మ్యాన్. మీరు కూడా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. అహంకారం, ఈగోలకు తావివ్వకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. అన్నింటికీ నిబంధనలు, రూల్స్ అని చూడకుండా మానవీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది" అని చంద్రబాబు హితవు పలికారు. తన గత పాలన అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "1995లో సీఎంగా ఉన్నప్పుడు చాలా కఠినంగా వ్యవహరించేవాడిని. విపత్తుల సమయంలో అధికారుల కంటే ముందు నేనే క్షేత్రస్థాయిలో ఉండేవాడిని. ఆ తర్వాత, హుద్‌హుద్ తుపాను సమయంలో విశాఖలో 10 రోజులు మకాం వేశాను. నాయకులు రిస్క్ తీసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయి" అని అన్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో అసత్య ప్రచారాలు పెనుసవాలుగా మారాయని, వాటిని మొదటి గంటలోనే గుర్తించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ, వారు చెప్పిన అంశాల్లో మంచి చెడులను విశ్లేషించి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పనులను చేపట్టాలని 'పొలిటికల్ గవర్నెన్స్' ప్రాముఖ్యతను వివరించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ జలవనరుల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఒక్క ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నా ఇబ్బందులు రాకుండా సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. "గతేడాదితో పోలిస్తే వర్షపాతం తక్కువే అయినా, సమర్థ నిర్వహణతో నీటి సమస్య రానివ్వలేదు. ఇది మంచి పరిణామం" అని అన్నారు.రాష్ట్రంలోని జలాశయాల్లో ప్రస్తుతం 1,031 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ఇది మొత్తం సామర్థ్యంలో 79 శాతమని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని 38,457 చెరువులను వీలైనంత త్వరగా నింపాలని, తద్వారా ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని చంద్రబాబు సూచించారు.ముఖ్యంగా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. "ఈ ప్రాజెక్టు కోసం ఈ ఏడాది రూ.1,000 కోట్లు, వచ్చే ఏడాది మరో రూ.1,000 కోట్లు కేటాయిస్తాం. వంశధార, నాగావళి, చంపావతి నదులను అనుసంధానించి ఉత్తరాంధ్రలో శాశ్వత నీటి నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలి," అని స్పష్టం చేశారు. అదేవిధంగా, శ్రీశైలం డ్యామ్ భద్రత పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, వెలిగొండ, వంశధార, తోటపల్లి వంటి ప్రాధాన్య ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూగర్భ జలాల సమాచారాన్ని రియల్ టైంలో తెలుసుకునేందుకు మూడు నెలల్లో కొత్త సెన్సర్లను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa