ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్మూ కాశ్మీర్ ఆప్ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Sep 14, 2025, 04:08 PM

ప్రజాప్రతినిధిపై ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ - PSA) కింద చర్యలు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ జమ్మూ కాశ్మీర్‌లోని ఏకైక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్‌పై పోలీసులు ఈ పీఎస్ఏ చట్టాన్ని ప్రయోగించి అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గత వారం పోలీసులు అదుపులోకి తీసుకున్న మెహ్రాజ్ మాలిక్‌‌పై ఇప్పటికే 18 కేసులు నమోదై ఉన్నాయని.. పోలీస్ డైరీలో ఆయనపై రోజువారీ నివేదికలు ఉన్నాయని దోడా జిల్లా మెజిస్ట్రేట్ జారీ చేసిన పీఎస్‌ఏ డాసియర్‌లో పేర్కొన్నారు.


33 పేజీల ఈ డాసియర్‌లో మాలిక్‌ను 'హిస్టరీ షీటర్'గా పేర్కొంటూ.. ఆయన సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టమని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా అధికారులు, రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తరచుగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని డాసియర్‌‌లో పేర్కొన్నారు. మఖ్యంగా ఎన్నికల డ్యూటీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం, వైద్యుల పట్ల అనుచిత భాష ఉపయోగించడం వంటి ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి.


1978లో ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేపై పీఎస్‌ఏ కింద కేసు నమోదు కావడం ఇదే మొదటి సారి. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని విచారణ లేకుండానే రెండు సంవత్సరాల వరకు నిర్బంధించవచ్చు. ఇటీవల దోడా జిల్లా మెజిస్ట్రేట్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే పోలీసులు మెహ్రాజ్ మాలిక్‌పై ఈ చట్టాన్ని ప్రయోగించారు. మాలిక్ అరెస్టుకు వ్యతిరేకంగా దోడాలో భారీ నిరసనలు చెలరేగాయి. పరిస్థితిని అదుపు చేయడానికి అధికారులు కర్ఫ్యూ విధించి.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ ఘర్షణల్లో పోలీసులు, నిరసనకారులు గాయపడ్డారు.


ఈ అరెస్టుపై రాజకీయ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఈ అరెస్టును సమర్థిస్తుండగా.. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి ఇతర పార్టీల నాయకులు మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa