మరోసారి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్రమైన విమర్శలు గుప్పించారు. తాను ప్రజల సేవకుడినని, వారే తనకు రిమోట్ కంట్రోల్ అని వ్యాఖ్యానించారు. తాను అనుభవిస్తోన్న బాధను వారికే తెలియజేస్తానని పేర్కొన్నారు. అంతేకాదు, తాను శివభక్తుడినని, దూషణలు అనే విషాన్ని మింగేస్తానని అన్నారు. ఈ మేరకు తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తోన్న మోదీ.. ఆదివారం అసోంలోని దరంగ్‌లో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు.
మోదీ మాట్లాడుతూ... ‘‘నన్ను లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ మళ్లీ నేడు ఏడుస్తున్నానని అంటోది.. కానీ, ప్రజలే నా దేవుడు.. నేను నా బాధను వారికంటే వేరేవరి ముందు చెప్పుకోగలను? వారే నా యజమానులు.. నా దేవతలు.. నా రిమోట్ కంట్రోల్.. నాకు ఇంకో రిమోట్ కంట్రోల్ లేదు’ అని అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఆర్జేడీ–కాంగ్రెస్ సభలో తనపై జరిగిన దూషణలను మోదీ ఎత్తిచూపుతూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఆ వేదికపై రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్‌లు లేరని కాంగ్రెస్-ఆర్జేడీ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రధాని తల్లి ఏఐ వీడియోను బిహార్ కాంగ్రెస్ విడుదల చేయడంతో కొత్త వివాదం మొదలైంది.
అయితే, ‘రిమోట్ కంట్రోల్’విమర్శలకు రాజకీయ ప్రాధాన్యత ఉంది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అప్పటి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్‌లో ఉన్నారని కూడా విమర్శించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.
అసోం గర్వకారణమైన గాయకుడు భూపెన్ హజారికాకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేస్తే.. కాంగ్రెస్ అధ్యక్షుడు ‘మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారని ప్రధాని అన్నారు. 2019లో ఖర్గే వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘డాక్టర్ భూపేన్ హజారికా దేశపు అత్యంత ప్రతిభావంతులైన కళాకారుల్లో ఒకరు. సంగీతం, కవిత్వం, సాహిత్యం, సినిమాల ద్వారా ఆయన చేసిన కృషి అసోం సంస్కృతి, కళను ప్రపంచానికి పరిచయం చేసింది’’అని పేర్కొంది.
భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యలను మోదీ గుర్తుచేస్తూ... 1962లో భారత్–చైనా యుద్ధం తరువాత ఈశాన్య ప్రజల గాయాలు ఇంకా మానలేదని ఆయన అన్నారని గుర్తు చేశారు. ‘ప్రస్తుత కాంగ్రెస్ తరం ఆ గాయాలపై ఉప్పు చల్లుతోంది’ అని అన్నారు. ‘అసోంను దశాబ్దాలపాటు కాంగ్రెస్ పాలించింది. కానీ 65 ఏళ్లలో బ్రహ్మపుత్ర నది మీద కేవలం మూడు బ్రిడ్జిలు మాత్రమే నిర్మించింది. కానీ మీరు మాకు అవకాశం ఇవ్వగానే ఒక్క దశాబ్దంలోనే ఆరు వంతెనలు నిర్మించాం. అందువల్లే మీరు మా కృషిని గుర్తించి మాకు ఆశీర్వదిస్తున్నారు’ అని మోడీ అన్నారు.
‘ఆపరేషన్ సిందూర్’ గురించి మోదీ మాట్లాడారు. కాంగ్రెస్ పాలన మాదిరిగా ఉగ్రదాడులు జరిగితే మౌనంగా కూర్చోలేదని, ఇప్పుడు మన సైన్యం పాకిస్థాన్ అంతటా ఉగ్రవాదాన్ని నేలమట్టం చేస్తోందని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం పాక్ అజెండాలను ముందుకు నెడతారు.. దాయాది అబద్ధాలు కాంగ్రెస్ అజెండాగా మారతాయి. అందుకే కాంగ్రెస్‌పై ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి’ అని హెచ్చరించారు. అసోంలోని ప్రధాన సమస్య అయిన చొరబాటుదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ ‘కాంగ్రెస్‌కి దేశం కన్నా ఓటు బ్యాంక్ ముఖ్యం’ అని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa