ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతి నిరుద్యోగ నిర్మూలనే తమ ప్రభుత్వ అజెండా అని ప్రకటన

international |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 07:10 PM

నేపాల్‌లో  తీవ్ర ఆర్థిక సంక్షోభం, ప్రభుత్వ నిర్ణయాలపై అసంతృప్తితో నేపాల్‌లో యువత చేపట్టిన ఆందోళనలు ఫలించాయి. 'జెన్ జీ' తరం ఆధ్వర్యంలో జరిగిన హింసాత్మక నిరసనల ధాటికి పాత ప్రభుత్వం కుప్పకూలగా, దేశంలో కొత్త రాజకీయ శకం మొదలైంది. దేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ (73) తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టి తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. దేశాన్ని తిరిగి గాడిన పెట్టడం, యువత ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ఈ తాత్కాలిక ప్రభుత్వం పనిచేయనుంది.ప్రధాని సుశీల కర్కీ తన మంత్రివర్గంలో ముగ్గురు కీలక వ్యక్తులకు స్థానం కల్పించారు. సమాజంలో మంచి పేరున్న, తమ రంగాల్లో నిపుణులైన వారిని ఎంపిక చేసుకోవడం గమనార్హం.ఓమ్ ప్రకాశ్ అర్యాల్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఈయనకు హోం, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల వంటి కీలక శాఖలను అప్పగించారు.కుల్మన్ ఘిసింగ్ నేపాల్ విద్యుత్ అథారిటీ మాజీ అధిపతిగా, దేశంలో ఏళ్ల తరబడి ఉన్న విద్యుత్ కోతలకు చరమగీతం పాడిన వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు ఆయనకు ఇంధనం, మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణాభివృద్ధి శాఖల బాధ్యతలు ఇచ్చారు. ఈ నియామకంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.రమేశ్వర్ ఖానల్ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ఆర్థిక కార్యదర్శి అయిన ఈయనకు ఆర్థిక శాఖను కేటాయించారు. దేశంలో 25 శాతం మేర ఉన్న యువ నిరుద్యోగితను పరిష్కరించే గురుతర బాధ్యతను ఆయనపై ఉంచారు.తాజాగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని సుశీల కర్కీ మాట్లాడుతూ, తాను ఈ పదవిని కోరుకోలేదని, ప్రజల ఆకాంక్షల మేరకే బాధ్యతలు స్వీకరించానని స్పష్టం చేశారు. "నా పేరు సమాజం నుంచి తెరపైకి వచ్చింది... ఈ ప్రభుత్వం 'జన్ జీ' తరం ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తుంది" అని ఆమె హామీ ఇచ్చారు. అవినీతిని అంతం చేయడం, ఆర్థిక సమానత్వాన్ని సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ఆమె పేర్కొన్నారు. ఇటీవలి ఆందోళనల్లో ధ్వంసమైన అధ్యక్ష భవనం సమీపంలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.సెప్టెంబర్ 8న ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించడం, పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. డిస్కార్డ్ వంటి యాప్‌ల ద్వారా వేలాది మంది ఏకమై భారీ నిరసనలకు దిగారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి పార్లమెంట్ భవనంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టారు. రెండు రోజుల పాటు జరిగిన ఘర్షణల్లో 72 మంది మరణించగా, 191 మంది గాయపడినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ సంక్షోభ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్, అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ యువజన సంఘాల నేతలతో చర్చలు జరిపి, సుశీల కర్కీ పేరును ప్రధాని పదవికి ప్రతిపాదించారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించి, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa