ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్ ఇంటర్నేషనల్ ఇండియా నుంచి భారత సైన్యంలోకి

national |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:23 PM

అందాల పోటీల్లో పాల్గొనాలని.. అందులో విజేతగా నిలిచీ కిరీటం దక్కించుకోవాలని చాలా మంది యువతులకు ఒక కల ఉంటుంది. మోడలింగ్ ప్రపంచం ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇలా.. లైఫ్ అంతా రంగుల ప్రపంచంగా ఉండాలని కోరుకుంటారు. అయితే మరో రకం యువతులు మాత్రం.. తాము దేశం కోసం ఏదైనా చేయాలని పరితపిస్తూ ఉంటారు. అందుకోసం ఎంతటి కష్టం, శ్రమను అయినా పడతారు. పురుషులతో సమానంగా పోటీ పడి మరీ.. దేశ రక్షణ కోసం నిలుస్తారు. ఇలాంటి వారు.. సైన్యంలో చేరి.. దేశాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటారు. కానీ ఈ రెండింటినీ కేవలం 24 ఏళ్ల వయసులోనే సాధించేసింది ఓ యువతి. మొదట మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా నిలిచి.. ఆ తర్వాత సైన్యంలో చేరి ఒక ఉన్నతాధికారిగా తన కర్తవ్యాన్ని చేపట్టింది ఆ యువతి. ఆమెనే కాశిష్ మెత్వానీ . 2023 మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా నిలిచిన కాశిష్ మెత్వానీ.. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరి కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని.. ఇప్పుడు లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు.


మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన 24 కాశిష్ మెత్వానీ.. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్‌ విజేతగా నిలిచారు. ఇక చదువులోనూ రాణించిన కాశిష్ మెత్వానీ.. అమెరికాలోని ప్రముఖ హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ సీటును దక్కించుకున్నారు. అయితే అటు అందమైన మోడలింగ్ రంగంలో అవకాశాలను పక్కనబెట్టి.. ఇటు హార్వర్డ్ ఆఫర్‌ను తిరస్కరించి.. సైన్యంలో చేరాలని దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2024 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఏడాది పాటు కఠినమైన శిక్షణ తర్వాత ఇప్పుడు లెఫ్టినెంట్ హోదాను పొందారు.


2001 జనవరి 9వ తేదీన మహారాష్ట్ర ముంబైలో పుట్టిన కాశిష్ మెత్వానీ.. పుణెలో పెరిగారు. చిన్నతనం నుంచే చదువుతోపాటు క్రీడలు, ఇతర కళల్లో కాశిష్ మెత్వానీ ముందువరుసలో ఉండేవారు. పుణె యూనివర్సిటీ నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందిన కాశిష్.. బెంగళూరులోని ఐఐఎస్‌సీలో న్యూరోసైన్స్‌లో పరిశోధనలు చేశారు. అంతేకాకుండా డ్యాన్స్, తబలా వాయించడంలోనూ ప్రావీణ్యం సంపాదించారు. పిస్టల్ షూటింగ్, బాస్కెట్‌బాల్‌లో వంటి ఆటల్లో నేషనల్ లెవెల్‌లో పలు పోటీల్లో పాల్గొన్నారు. కాశిష్ తండ్రి డాక్టర్ గుర్ముఖ్ దాస్ ఒక సైంటిస్ట్. తల్లి శోభ.. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో ఒక టీచర్.


చిన్నప్పటి నుంచి సైనిక పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత కాలేజీ చదువులు చదువుతుండగానే.. ఎన్‌సీసీలో చేరారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా మార్చ్‌లో పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. ఉత్తమ క్యాడెట్‌గా అవార్డును అందుకున్నారు. అయితే అప్పుడే తాను సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు కాశిష్ మెత్వానీ చెబుతారు. సరిగ్గా అదే సమయంలో ఫ్యాషన్‌ ప్రపంచం వైపు ఆమె ఆకర్షితురాలు అయ్యారు. ఈ క్రమంలోనే మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొని.. 2023 ఏడాదికి గానూ మిస్‌ ఇంటర్నేషనల్‌ ఇండియాగా ఎంపికయ్యారు.


ఇక ఆ తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్న కాశిష్ మెత్వానీ.. 2024లో సీడీఎస్‌ పరీక్ష రాసి నేషనల్ లెవల్‌లో రెండో ర్యాంకుతో సత్తా చాటారు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ పూర్తి చేసుకుని.. ఇటీవలే లెఫ్టినెంట్‌గా సైన్యంలో చేరారు. ఈ ట్రైనింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన కాశిష్ మెత్వానీ.. మార్చ్ అండ్ షూట్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించారు. ట్రైనింగ్‌లో కూడా అత్యధిక షూటింగ్ స్కోరు దక్కించుకున్నారు. ఇటీవల ఈనెల 6వ తేదీన భారత సైన్యంలోని ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్‌లో కాశిష్ మెత్వానీ చేరారు. ఈ ఎయిర్ డిఫెన్స్ రెజిమెంట్ యూనిట్.. కొన్ని నెలల క్రితం పాకిస్తాన్‌పై జరిపిన ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించింది.


Samayam Telugu


Miss Universe: 60 ఏళ్లకు మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ కిరీటం.. చరిత్రలోనే తొలిసారి


 


అయితే అందాల పోటీలు తన అభిరుచి మాత్రమేనని.. కానీ అదే తన కెరీర్ కాదని కాశిష్ మెత్వానీ స్పష్టం చేశారు. ఎన్‌సీసీలో చేరిన తర్వాతే తన జీవిత లక్ష్యం ఏంటో తనకు అర్థమైందని తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఉత్తమ క్యాడెట్ ట్రోఫీ అందుకున్నప్పుడే.. తనకు సరికొత్త గుర్తింపు వచ్చిందని.. సైన్యంలో చేరాలని అప్పుడే గట్టిగా నిర్ణయం తీసుకున్నానని కాశిష్ మెత్వానీ వెల్లడించారు. కాశిష్ మెత్వానీలో ఈ టాలెంట్‌లు మాత్రమే కాకుండా.. సేవా గుణం కూడా ఉంది. 19 ఏళ్ల వయసులో ఉండగానే.. క్రిటికల్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన కాశిష్ మెత్వానీ.. ప్లాస్మా, రక్తం, అవయవ దానం వంటి వాటిని ప్రోత్సహించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa